calender_icon.png 12 January, 2026 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి

07-01-2026 12:00:00 AM

కలెక్టర్ చంద్రశేఖర్

మిర్యాలగూడ జనవరి 6 (విజయక్రాంతి) :  యూరియా సరఫరా పంటల సాగు లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం  మిర్యాలగూడ సమీపంలో ఉన్న తుంగపహాడ్ మార్క్ఫెడ్ వేర్ హౌసింగ్ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ యూరియా నిల్వలు,సరఫరా, రవాణా, లారీల ఏర్పాటు, సమస్యలను మార్క్ ఫెడ్ అధికారుల  ద్వారా అడిగి తెలుసుకున్నారు.అనంతరం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఎరువుల దుకాణం లో ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్న  ఎరువుల సరఫరా ప్రక్రియను పరిశీలించారు. ఎరువుల విక్రయాలు ఆన్లైన్లో ఏ విధంగా చేస్తున్నారో డీలర్, రైతుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రైతులు జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ ఏ మండలంలోని రైతులకు ఆ మండలంలోనే ఎరువులు సరఫరా చేయాలని, ఆన్లైన్లో స్టాక్ చూపించిన 10, 20 నిమిషాల్లోనే యూరియా స్టాక్ అయిపోతున్నదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ తెలిపారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ తో రబీ వ్యవసాయ ప్రణాళిక పై సమీక్షించారు.

కాగా ఈ రబికి సంబంధించి జిల్లాలో 6,57,000 ఎకరాలు సాగు విస్తీర్ణం కానుందని,ప్రత్యేకించి రబీలో 74,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు 35,000 మెట్రిక్ టన్నులు విక్రయించడం జరిగిందని ,గోదాంలో 10000 మెట్రిక్ టన్నులు నిల్వ ఉండగా, డీలర్ల వద్ద మరో 3000 మెట్రిక్ టన్నుల యూరియా ఉందని తెలిపారు. ఎరువులకు సంబంధించి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న  ఎరువుల ఆప్ పై కలెక్టర్ ఆరా తీశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్,జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, మార్క్ ఫెడ్ అధికారి వీరస్వామి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సైదా నాయక్ తదితరులు  పాల్గొన్నారు.