14-12-2025 12:12:27 AM
ముషీరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఫుట్ బాల్ ఆడుకుంటున్నాయని బీసీ నేతలు ఆరోపించారు. ఈనెల 14,17 తేదీలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలను అన్ని స్థానాల్లో నిలబెట్టి రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెపుతామని వారు హెచ్చరించారు.
శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మేధావుల ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు, తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ బాలగో ని బాలరాజ్ గౌడ్, కన్వీనర్లు అయిలి వెంకన్నగౌడ్, ఎలికట్టి విజయ్ కుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్ లు మాట్లాడారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కృషి చేయాలన్నారు.
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు జనరల్ స్థానాల్లో అధిక సీట్లలో పోటీ చేసి 50 శాతానికి పైగా సర్పంచులు గెలుపొందారని తెలిపారు. శీతకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న కూడా రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు బీసీల రిజరేషన్ల బిల్లుపై నోరుమెదవడం లేదని విమర్శించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పది రోజుల్లో అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లపై నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు.
రాజకీయ పార్టీలకు చిత్తశుద్ది ఉంటే తక్షణమే 42 శాతం రిజర్వేషన్లు అమలుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకు తాము ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ నేతలు ఎస్. దుర్గయ్య గౌడ్, పిడికిలి రాజు, కెవి. గౌడ్, అవ్వారు వేణు తదితరులు పాల్గొన్నారు.