17-11-2025 12:36:20 AM
హీరోయిన్‌గానే కాకుండా తన పాత్రకు ప్రాధాన్యముంటే చాలు ఆ స్క్రిప్టును ఓకే చేస్తూ కెరీర్‌లో దూసుకెళుతోంది చాందిని చౌదరి. షార్ట్ ఫిల్మ్స్‌లో సత్తా చాటి తర్వాత సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి 2015లో ‘కేటుగాడు’తో టాలీవుడ్‌లో కథానాయిక గా పరిచయమైంది. అంతకుముందు ఆమె ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది.
‘బ్రహ్మోత్సవం’, ‘శమంతకమణి’ ‘సమ్మతమే’, ‘గామి’, ‘మ్యూజిక్ షాప్ మూర్తి’, ‘యేవమ్’, ‘డాకు మహరాజ్’, ‘కలర్ ఫోటో’ వంటి ప్రేక్షకాదరణ పొందిన సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. తాజాగా ‘సంతాన ప్రాప్తిరస్తు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భామ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా ఇంటిమేట్ సీన్స్ చేయాలని తనను బలవంతపెట్టారని చెప్పుకొచ్చింది.
“అది నేను చేసిన రెండో సినిమా. కథ నచ్చి సైన్ చేశా. నాకు కథ చెప్పినప్పుడు రొమాంటిక్ సీన్స్ గురించి ఏమీ చెప్పలేదు. కానీ, షూటింగ్‌కు వెళ్లిన తర్వాత ముద్దు సన్నివేశంలో నటించాలని చెప్పడంతో షాక్ గురయ్యా. అప్పుడు ‘అర్జున్‌రెడ్డి’ బ్లాక్‌బస్టర్ కావడంతో అలాంటి సీన్స్ పెడితే బాగా వర్కౌట్ అవుతుందంటూ నన్ను ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఇది ట్రెండ్. ఇలా చేస్తే సినిమా జనంలోకి బాగా వెళ్తుందని చెప్పారు.
తాము చెప్పినట్లు చేయకపోతే కొత్త అమ్మాయి మాట వినడం లేదన్న ప్రచారం జరిగి కెరీర్‌కు ఇబ్బంది కలుగుతుందని భయపెట్టారు. అప్పుడు నేను మానసికంగా ఎంతో ఒత్తిడికి గురయ్యా. కెరీర్ గురించి ఆలోచించుకుంటూ నేను ఆ సీన్ చేయాలా.. వద్దా? అన్న సందిగ్దంలో ఉన్నప్పుడు ఆ హీరో నా కంఫర్ట్‌ను ఆలోచించుకుని తానే ఆ సీన్ చేయనని చెప్పేశాడు. అసలు ఆయన అలా చెబుతాడని నేను అనుకోలేదు. ఆయన అలా చెప్పటంతో నేను ఊపిరి పీల్చుకున్నా. హీరో ఆ నిర్ణయం తీసుకోకపోతే నేను బలవంతంగానైనా ఆ సన్నివేశం చేయాల్సి వచ్చేది.
అప్పట్నుంచి ఏ సినిమా ఒప్పుకునేటప్పుడైనా ప్రతి సన్నివేశం గురించి వివరంగా అడుగుతాను. షూటింగ్ సమయంలో సీన్ మార్చి చెబితే నో చెప్పేస్తాను. ప్రేక్షకులు ఎప్పుడూ కంటెంట్‌నే చూస్తారు. కేవలం ముద్దు సన్నివేశాలు, రొమాన్స్ సీన్లు ఉంటేనే సినిమా హిట్ అవుతుందనుకోవడం కరెక్ట్ కాదు” అని తెలిపింది. చాందిని చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.