10-05-2025 12:31:36 AM
మహబూబ్ నగర్ మే 9 (విజయ క్రాంతి) : ప్రజలను మోసం చేసే హామీలు ఇచ్చి అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ అవస్థలు పడుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం హన్వాడ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మోసపూరితమైన వంటి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. మాకు పరిపాలన తెలుసని హామీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నార న్నారు. రైతులకు రుణమాఫీ జరగలేదని..రైతు బందు లేదు.. రైతు భీమా లేదు.. కనీసం పండించిన పంట కొనడం లేదని విమర్శించారు.
పెన్షన్ కూడా సమయానికి రావడం లేదని వృద్దులు..మహిళలు గ్రామాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి రాకపోవడంతో పేదింట్లో ఆడపిల్లల పెండ్లిలకు ఇబ్బందులు అవుతున్నారని చెప్పారు. గ్రామా ల్లోకి వచ్చినప్పుడు ఎన్నికల హామీలు ఏం అయ్యాయని నిలదీయాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి మోసపోయామని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.. బయపడకండి మీ వెంట మేము ఉన్నామని భరోసా కల్పించారు.వచ్చే ఎన్నికల్లో తిరిగి బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, కెసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రజలకు మంచి పాలనా అందిస్తారని చెప్పారు.
ఎన్నికల తర్వాత ఇతర పార్టీలో చేరిన నాయకులు తిరిగి పార్టీలోకి వస్తున్నారని, పార్టీ సీనియర్ లీడర్స్ తో సమన్వయము చేసుకొని తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింద న్నారు. ఈ కార్యక్రమంలో హన్వాడ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ నరేందర్, సీనియర్ నాయకులు చెన్నయ్య, కొండా లక్ష్మయ్య, శ్రీనివాసులు, అనంత రెడ్డి, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.