24-12-2025 12:00:00 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్ 23 (విజయక్రాంతి) : సూర్యాపేట-జనగామ365(బీ)జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జిల్లా కేంద్రం సూర్యాపేట నుండి తిరుమలగిరి వరకు 40 కిలోమీటర్ల రహదారిని 2019లో సుమారు రూ.140 కోట్లతో రెండు వరుసగా విస్తరించారు. రామన్నగూడెం,అర్వపల్లి,తిరుమలగిరిలలో సెంట్రల్ లైటింగ్, రెయిలింగ్ తో కూడిన నడకదారులు కూడా విస్తరించారు.
అలాగే వాహన చోదకుల విశ్రాంతి కోసం రహదారి పక్కన కొన్నిచోట్ల ట్రక్ లేబైలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ లేబైలలో భాగంగా తిమ్మాపురం గ్రామ శివారులోని జ్యోతులనగర్, వేల్పుచర్ల వద్ద డ్రైవర్ల కోసం రూ.15లక్షలకు పైగా ఖర్చు చేసి ప్రత్యేక గదులతో పాటు మరుగుదొడ్లు, స్థానపు గదులు, నీటి వసతి కల్పించారు. కానీ నిర్మాణం పూర్తయిన కొద్ది కాలానికి ఈ వసతులు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి.
గదులు శిథిలమైపోగా, వేల్పుచర్ల వద్ద మరుగుదొడ్డి పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో ట్రక్ లే బై వద్ద తమ వాహనాలను ఆపి విశ్రాంతి తీసుకోవాలనుకునే డ్రైవర్లు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా వసతులను పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకురావాలని వాహనదారులు, ప్రయాణికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
వినియోగంలోకి తేవాలి
హైవేపై పలుచోట్ల నిర్మించిన ట్రక్ లేబైలు ఎలాంటి నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి.గత కొన్నేళ్లుగా వీటికి ఎలాంటి మరమ్మతులు చేయడం లేదు.ట్రక్ లేబైల వద్ద వసతులు కల్పించి వాటిని వినియోగంలోకి తేవాలి.
మన్నె సింహాద్రియాదవ్, సామాజిక కార్యకర్త, కుంచమర్తి