31-12-2025 12:00:00 AM
మెహిదీపట్నం వ్యాపారికి కేటుగాళ్ల వల
హోటల్‌కు పిలిపించి నగదుతో ఉడాయించిన వైనం
రంగంలోకి పోలీసులు.. ఒకరి అరెస్ట్
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 30 (విజయక్రాంతి): సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశ, క్రిప్టో కరెన్సీపై ఉన్న మోజు ను ఆసరాగా చేసుకున్న ఓ ముఠా.. హైదరాబాద్ నగరంలో భారీ మోసానికి పాల్పడిం ది. ఇండియన్ కరెన్సీ ఇస్తే, దానికి సమానమైన విలువ గల క్రిప్టో కరెన్సీ ఇస్తామని నమ్మబలికి ఓ వ్యాపారి నుంచి ఏకంగా రూ. కోటి కాజేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెహిదీ పట్నం ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్ల ముఠా పరిచయమైంది. తమ వద్ద భారీగా క్రిప్టో కరెన్సీ ఉన్నదని, నగదు ఇస్తే తక్కువ రేటుకే బదిలీ చేస్తామని నమ్మించారు. వారి మాటలు నమ్మిన వ్యా పారి, రూ కోటి నగదుతో బంజారహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్ కు వచ్చాడు.
హోటల్ గదిలో చర్చల పేరుతో వ్యాపారిని కలిసిన ముఠా సభ్యులు.. ఆయన నుంచి రూ.కోటి నగదు తీసుకున్నారు. క్రిప్టో కరెన్సీని ఇప్పుడే మీ వాలెట్‌కు బదిలీ చేస్తామని మాటల్లో పెట్టి చాకచక్యంగా అక్కడి నుంచి జారుకున్నారు. ఎంతసేపటికీ వారు తిరిగి రాకపో వడం, ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో మోసపోయానని గ్రహించిన బాధితు డు లబోదిబోమంటూ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీ, కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టి, ఈ మోసానికి పాల్ప డిన ముఠాలోని హైమద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.