04-12-2025 12:53:48 AM
5 వరకు దరఖాస్తుల స్వీకరణ.. 9న ఉప సంహరణ
అచ్చంపేట, డిసెంబర్ 3: గ్రామపంచాయతీ సంగ్రామంలో కీలకమైన మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ల పరిధిలోని అచ్చంపేట, అమ్రాబాద్, పదర, లింగాల, బల్మూర్, ఉప్పనుంతల, చారగొండ మండలాల పరిధిలోని 158 గ్రామ పంచాయతీలు, 1,364 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
ఆయా పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యలకు పోటీ చేసే ఆశావాహు అభ్యర్థులు తొలిరోజు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు ఆయా మండలాల్లో క్లస్టర్ల వారిగా నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలిరోజైన బుధవారం భారీగా దరఖాస్తులు స్వీకరించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
9న ఉప సంహరణ
మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పక్రియలో భాగంగా ఈ నెల 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 6న దరఖాస్తుల పరిశీలన, అదే రోజు సాయంత్రం జాబితా ప్రకటన చేస్తారు. 9న ఉప సంహరణ, 17న పోలింగ్ నిర్వహిస్తారు.
అదే రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠ్మాత్మ కంగా తీసుకున్నాయి. పార్టీల వారిగా భరిలోని అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ.. విజయం తమ మద్దతు అభ్యర్థినే వరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రచారం ఆరంభం
సర్పంచి, వార్డు సభ్యలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన వెంటనే తమదైన శైలిలో ప్రచారం ప్రారంభించారు. ఓటరు మహాశయున్ని ప్రచారం చేసుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఖర్చుకు సైతం వెనకాడకుండా.. గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కొన్ని చోట్లా ఏకగ్రీవాలు చేసుకునేందుకు ఒత్తడి మొదలెట్టారు. దాని కోసం పదవి పందెం పోటీలు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.