04-11-2025 01:16:35 AM
							బాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్నాయి ‘స్త్రీ’ ఫ్రాంచైజీ చిత్రాలు. మాడాక్ ఫిల్మ్స్ తెరకెక్కించిన ఈ సినిమాతో ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు శ్రద్ధా కపూర్. ఇప్పుడామె మరోసారి మాడాక్ ఫిల్మ్స్‌తో జతకట్టింది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ‘ఛావా’, ‘లూకా చుప్పీ’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మహారాష్ట్రలో బహుళ ప్రాచుర్యం పొందిన తమాషా కళారూపం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది.
ఈ కళతో ప్రజలను రంజింపజేసిన మరాఠీ లెజెండ్ విఠాబాయి బయోపిక్ ఇది. విఠాబాయిని ప్రజలు ‘ఈతా’గా పిలుచుకుంటారు. ఆ పేరే సినిమాకు పెట్టారు. మహారాష్ట్ర జానపద సంస్కృతిని వెండితెరపై ఆవిష్కరించే లక్ష్యంతో ‘ఈతా’ ముస్తాబవుతోంది. శ్రద్ధా ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తోంది. సంగీత ప్రాధాన్య చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శక ద్వయం అజయ్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. తమాషా కళారూపం ఆత్మకు జీవం పోయడానికి క్లాసిక్ మరాఠీ ట్యూన్లను పునఃసృష్టించేందుకు ఈ స్వరకర్తలిద్దరూ కృషి చేస్తున్నారు.