03-12-2025 12:00:00 AM
తెలంగాణ ప్రజల వాడుక భాష , వాటి సౌందర్యాలను ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వాచకాల్లో ప్రవేశపెట్టాల్సిన అవసరముంది. దీనివల్ల కనీసం ఒకటి, రెండు తరాల తర్వాతనైనా మన సంస్కృతి, భాష సజీవంగా ఉండే అవకాశం ఉంటుంది.
‘ఒక ప్రాంతం దేశం మీద పట్టు సాధించాలంటే ఆ ప్రజల భాషా సంస్కృతులను ముందుగా మార్చాలి. అప్పుడు ఆయా ప్రాంతాలను, ప్రజలను, దేశాలను సునాయాసంగా తమ ఆధీనంలోకి తీసుకు రావచ్చు’
మాక్సిమ్ గోర్కి :గోర్కి మాటలకు ఉదాహరణగా చెప్పుకుంటే.. బ్రిటిష్ కాలంలో భారతదేశ ప్రజలపై ఇంగ్లీషు భాష సంస్కృతిని బలవంతంగా రుద్దారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో వివిధ భాషలపైన, అనేక ప్రజా సమూహాలు, సంస్కృ తులపైన.. హిందీ భాషా సంస్కృతులను బలవంతంగా ప్రవేశపెట్టే ప్రయత్నం అనేకసార్లు చేశారు. కానీ ప్రాంతీయ భాషలు మాట్లాడే నాయకులు హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకించారు.
హిందీ మాట్లాడే ప్రాంతాల నుంచి కేంద్రంలో ఎన్నికైన ప్రధాన నాయకులు పదే పదే ఈ అంశా న్ని తెర మీదికు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ భాషల నాయకులు హెచ్చరికలు చేస్తూనే వస్తున్నారు. ఈ సంగతి కాసేపు పక్కనబెడితే దేశంలో మరోవైపు ప్రామాణిక భాష వాచకాల్లోకి ప్రవేశించడం మొదలైంది.
ప్రజాభాషపైన అనేకానేక రూపాల్లో మనల్ని ముంచెత్తుతున్న ప్రపంచీకరణ, పీ డిత ప్రజలపైన ఆధిపత్యాల సంస్కృతి నుంచి మనల్ని విడదీసే యత్నాలు నిరంతరంగా జరుగుతూనే వస్తున్నది. మన భాష నుంచి, మన సంస్కృతి నుంచి, మన ఉత్పత్తి నుంచి, మన ప్రాంతం నుంచి.. మనల్ని ‘పరాయికరణ’ ఎలా చేస్తుందనేది చెప్పడానికి ఇటీవల జరిగిన రెండు సంఘటనలు ఒకసారి ఆలోచనపరుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను.
మిత్రుడి పెళ్లిలో..
అందులో మొదటి అంశం ఏమిటంటే.. నేను ఒక దళిత సాహితీ మిత్రుడి పెళ్లికి హాజరయ్యాను. నాతో పాటు ఇద్దరు మిత్రులు వచ్చారు. ఆ మిత్రుడు బౌద్ధం, అంబేడ్కర్ ప్రభావితుడయిన కారణంగా సంప్రదాయ ఆచారాలకు వ్యతిరేకంగా పెళ్లి జరిగింది. నా వెంట వచ్చిన మి త్రులు.. ‘అయ్యో! అయ్యగారు, వేద మం త్రాలు లేకుండానే పెళ్లి జరిగింది.’ అంటూ ఆశ్చర్యంగా, ప్రశ్నార్ధకంగా మాట్లాడారు.
వేదిక మీద బుద్ధ విగ్రహం ఉంచి వచ్చిన బంధుమిత్రుల సాక్షిగా దండలు మార్చుకున్న అనంతరం కొత్త దంపతులు వారి వారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు. వివాహం అనంతరం ఏర్పా టు చేసిన ఊరేగింపు కావొచ్చు, విందులో కావొచ్చు.. సినిమా పాటలు, డీజే ఆర్భాటాలకు భిన్నంగా కేవలం అంబేద్కర్, ఫులే పాటలు మాత్రమే వినిపించాయి.
మన సంస్కృతిలో ప్రధాన స్రవంతి వేడుకలైన పెళ్లి, తద్దినాలు, పుట్టినరోజులు వంటి వ్య వహారాలకు వ్యతిరేకంగా ఇలాంటి పెళ్లిళ్లు కూడా ఉంటాయా అని నా వెంట వచ్చిన మిత్రులు తమలో తాము మల్లగుల్లాలు, తర్జనభర్జన పడుతున్నారు. అంతేకాదు ఒకింత ఆశ్చర్యానికి కూడా లోనయ్యారు.
సినిమాలో అవమానం..
ఇక రెండో సంఘటన విషయానికొస్తే.. వేర్వేరు అభిప్రాయాలు, వయస్సులు ఉన్న నలుగురైదుగురు మిత్రులతో కలిసి అనేక సంవత్సరాల తర్వాత ‘రాజు వెడ్స్ రాంబా యి’ సినిమాకు వెళ్లాము. ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన వేణు ఊడుగుల నాకు బాగా పరిచయం ఉన్న కవి. ఆయన వరంగల్ జిల్లా నర్సంపేట వాసి. గతంలో ‘నువ్వే నేను’, ‘విరాట పర్వం’ అనే సినిమాలకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఈ సినిమాకు వేణు ఊడుగుల నిర్మాతగా వ్యవహరించగా.. దర్శకుడైన సాయిలు సహా హీరో, హీరోయిన్ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినవాళ్లే. ఒక వాస్తవ కథను ఆసక్తిగా తీర్చిదిద్ది ఒక సినిమాగా రూపం కల్పించారు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా తీసిన ప్రాంతాలు, పాటలు, మాటలు, భాషా సంస్కృతులు తెలంగాణకు చెందినవి కావడం విశేషం. అందువల్ల కూడా ఈ సినిమాకు మేము పోవడం జరిగింది. సినిమాలో అబ్బాయి, అమ్మాయి మంగలి నాయి బ్రాహ్మణ
కులానికి చెందిన ప్రేమికులు. తెరమీద తెలంగాణ సహజ సిద్ధమైన భాష, తెలంగాణ మాండలికం.. సంభాషణల రూపం లో వినపడుతుంటే, కోట్లాది రూపాయలు పెట్టి తీసే యాంత్రిక, కృత్రిమ సినిమాలకు అలవాటు పడిన తెలంగాణ సామాన్య ప్రజలు, యువతీ యువకులు తమ తమ నేల బిడ్డల మాటలు, పాటలు, సంస్కృతి తెరమీద గంభీరంగా చూసి గర్వపడడానికి బదులుగా బాహటంగా నవ్వుకోవడం వినిపించి ఒకింత ఆశ్చర్యం కలిగింది.
సంస్కృతిపై చిన్నచూపు..
మిట్టపల్లి సురేందర్ రాసిన అర్థవంతమైన అద్భుతమైన పాటలకు ప్రేక్షకులు నుంచి పెద్దగా ప్రతిస్పందన రాలేదు. సిని మా సమాప్తం అయ్యేసరికి ఒక వేదన, బాధ నన్ను తీవ్రంగా వెంటాడి వెన్నంటి కురిపివేసింది. భూమి పుత్రుల సంస్కృతి పట్ల మన ప్రజల చిన్నచూపు చూసే పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? ఎందుకు ఇలా జరుగుతుంది? అన్న ప్రశ్నలు నన్ను తీవ్రంగా కలిచివేశాయి.
తెలుగు సినిమా ల్లో.. రాయలసీమ ప్రాంతం అనగానే ఫ్యా క్షనిస్టులు, తెలంగాణ ప్రాంతం అనగానే భాష హాస్య ప్రతి నాయకుడి పాత్రలకు పెట్టడం, కళింగాంధ్ర ప్రజల భాషను కిం చిత్తు అపహస్యం చేయడం లాంటి సినిమాలు చూసిన ప్రేక్షకుడు ఇలా ప్రవర్తిం చడం సహజం. దీంతో ప్రజలు తమ హావ భావాలను మరో విధంగా వ్యక్తీకరించడానికి ఆస్కారం లేకుండా పోయింది.
తెలుగు సినిమా చుట్టూ ఒక ఆధిపత్య వర్గాల అసహజ, అసమ సంస్కృతుల సమ్మేళనంతో వాతావరణం కలుషితంగా మారిపోయిం ది. అందుకే పరాయి సంస్కృతి అనే మాఫి యా చేతుల్లోంచి విముక్తి పొందాల్సిన అవసరముంది. కానీ తెలుగులో మంచి సి నిమాలు రావడం.. రావాలని కోరుకోవ డం ఎండమావుల్లో నీళ్లు వెతుక్కోవడం లాంటిదే అవుతున్నది. దీనికోసం తగిన కా ర్యచరణ సంబంధాలను వెతికి తెలుసుకునే దిశగా ఆలోచించడం మొదలు పెట్టాను.
పరాయికరణ దిశగా..
ఆధిపత్య ప్రాంతంలో వాడుకలో ఉన్న వ్యవహారిక భాష.. 1956 నవంబర్ 1న తెలుగు వాచకాల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో ని మూడు ప్రాంతాల సంస్కృతి భాషల ను క్రమక్రమంగా ఆక్రమించింది. తద్వారా ఈ సంస్కృత పద భూయిష్టమతో కూడిన భాషనే అసలైన తెలుగు భాష అనే భ్రమ ను ప్రజల్లో బలంగా కలిగించింది.
ఆ కారణంగా మూడు ప్రాంతాల భాషా సంస్కృ తుల వాచకాల్లోనే కాకుండా సినిమాల్లో, టీవీలోనూ అదే భాషను వాడి ప్రజల భా షా సంస్కృతులను ధ్వంసం చేసింది. 58 ఏళ్లుగా అలుపెరుగని పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ర్ట ప్రజలు మాట్లాడుకునే భాషను క్రమంగా మంచి సంస్కృతి నుంచి చాప కింద నీరులా తమ నుంచి తామే పరాయికరణ చెందేలా చే సింది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చి మొబైల్, సెల్‌ఫోన్ల ద్వారా ప్రజల జీ విత విధానాలను అతలాకుతలం చేస్తున్నది. అందువల్ల ఇటీవల చూసిన సినిమా లో వాడిన భాష, సంస్కృతి, పాత్రల స్వ భావాలు, వారి భావాలను ఈ ప్రాంతం వారే చూసి నవ్వుకునేలా చేయడం ఒక అవమానంలా భావించవచ్చు. అందుకే తక్షణమే తెలంగాణ ప్రజల వాడుక భాష సౌందర్యాలను ప్రభుత్వాలు పూర్తి స్థాయి లో వాచకాల్లో ప్రవేశపెట్టాల్సిన అవసరముంది.
దీనివల్ల కనీసం ఒకటి, రెండు తరాల తర్వాతనైనా మన సంస్కృతి, భాష సజీవంగా ఉండే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, తెలుగు సిలబస్ కమిటీలు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే ప్రజల సంస్కృతి, భాషల పునర్జీ వం అవకాశాలు మెరుగుపడతాయి.