calender_icon.png 2 November, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియాలో తొలి మోటోక్రాస్ రేసింగ్ చిత్రమిది

02-11-2025 12:44:16 AM

శర్వానంద్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్, ఫ్యామిలీ డ్రామా ‘బైకర్’ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ-ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాజశేఖర్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. అతుల్ కులకర్ణి, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 6న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ శనివారం ప్రకటించారు.

ఈ మేరకు ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈవెంట్‌లో హీరో శర్వా మాట్లాడుతూ.. “బైకర్’ ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్ ఇన్ ఇండియన్ సినిమా అని గర్వంగా చెప్పగలం. ఈ సినిమా చేయడం అంత ఈజీ కాదు. చాలా పెద్ద ఛాలెంజ్. ఇందులో కనిపించినది ఏది కూడా సీజీ షాట్ కాదు. ఒరిజినల్ బైకర్స్‌తో తీసిన ఒరిజినల్ స్టంట్స్. ఇండోనేషియా వెళ్లి బైకర్స్‌తో అక్కడ షూట్ చేసి వచ్చాం.

చాలా రిస్కులు, ఛాలెంజ్‌లు తీసుకున్నాం. ఈ సినిమా కెరియర్‌లో టర్నింగ్ పాయింట్. ఇలాంటి సినిమా చేయాలంటే నిర్మాతలకు గట్స్ ఉండాలి. ఈ సినిమా ఒక మ్యాజిక్. అందరికీ సినిమా ఎప్పుడెప్పుడు చూపించాలని ఎదురుచూస్తున్నా” అన్నారు. నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. “మంచి క్యారెక్టర్స్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత చాలా కథలు విన్నాను. చాలావరకు నాకు నచ్చేవి కాదు. మంచి సబ్జెక్ట్ రాలేదనే నిరాశ ఉండేది.

అలాంటి సమయంలో డైరెక్టర్ అభి ‘బైకర్’ స్టోరీ చెప్పారు. ఈ సినిమా చేస్తే మంచి పేరు వస్తుందని ఒప్పుకున్నా. డబ్బింగ్ చూసి శర్వా నా దగ్గరకు వచ్చి ‘చాలా అద్భుతంగా చేశారు.. ఈ క్యారెక్టర్ చేసినందుకు థాంక్స్’ అని చెప్పారు. అది నాకు పెద్ద అవార్డుతో సమానం” అన్నారు. ‘రేసింగ్ సినిమాలు చూసి మీరు ఎంత ఎక్సైట్ అయ్యారో దానికి ఇది మించినట్లు ఉంటుందీ చిత్రం. డిసెంబర్ 6న కొడుతున్నాం.

ప్రేక్షకులకు చాలా మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంద’ని డైరెక్టర్ అభిలాష్ రెడ్డి తెలిపారు. డీవోపీ యువరాజ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాని షూట్ చేయడం చాలా డిఫికల్ట్ ప్రాసెస్. ఇది రెగ్యులర్ సినిమాలా ఉండదు” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు నిరూప్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.