calender_icon.png 30 October, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాస్ రైల్వేపోలీస్ కథ ఇది

30-10-2025 12:00:00 AM

రవితేజ 75వ చిత్రం ‘మాస్ జాతర’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ కాగా, నవీన్‌చంద్ర ప్రతినాయక పాత్రలో అలరించనున్నారు. అక్టోబర్ 31న సాయంత్రం స్పెషల్ ప్రీమియర్స్‌తో థియేటర్లలో ‘మాస్ జాతర’ సందడి మొదలు కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన దర్శకుడు భాను కొన్ని సినిమా విశేషాలను పంచుకున్నారు.

రచయితగా కామెడీలో మంచి పేరు తెచ్చుకున్న నేను దర్శకుడిగా మాస్ సినిమాతో పరిచయమవ్వడానికి కారణం లేకపోలేదు. నిజానికి ‘సామజవరగమన’ లాంటి రొమాంటిక్ కామెడీతో దర్శకుడిగా పరిచయం అవ్వాలనుకున్నా. కానీ, ఎక్కువమంది మంచి మాస్ కథ ఉంటే చెప్పు అనేవారు. అలా ఈ కథ రాశాను. మాస్ కథ అంటే మొదట గుర్తుకొచ్చే పేరు రవితేజ. ఆయనను దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాశాను. రవితేజ పోలీస్ సినిమాలు కొన్ని చేశారు. అందుకే కొత్తగా ఉండేలా ఈ రైల్వేపోలీస్ కథ రాసుకున్నా. 

ఇది కల్పిత కథే. అయితే ఎంతో రీసెర్చ్ చేశా. కొందరు రైల్వేపోలీసులను కలిశా. 

ఇది రవితేజకు 75వ సినిమా అని మాకు ముందు తెలియదు. ఆయనకు కథ నచ్చి, సినిమా ఓకే అయిన తర్వాత లెక్కేస్తే 75వదని తెలిసింది. కథ బాగుంది, ఈ నంబర్ల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా సినిమా చేయమని రవితేజ ఎంతో ప్రోత్సహించారు.

నవీన్‌చంద్ర పాత్ర కోసం మొదట వేరే ఇద్దరు ముగ్గురు నటుల పేర్లు కూడా పరిశీలించాం. కానీ, సంతృప్తి అనిపించలేదు. నవీన్‌చంద్రకు కథ నచ్చి సినిమా చేయడానికి అంగీకరించారు. నవీన్ గొప్ప నటుడే, సందేహం లేదు. అయితే, ఈ పాత్రలో ఎలా ఉంటారోనని ప్రత్యేక మేకోవర్ చేసి, ఫోటోషూట్ చేశాం. ఆ లుక్ మా అందరికీ నచ్చింది. శివుడు పాత్రకు నవీన్ పూర్తి న్యాయం చేశారు. సినిమా విడుదలైన తర్వాత శివుడు పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.

ఇందులో శ్రీలీల తులసి పాత్ర కనిపిస్తారు. కథ రాస్తున్నప్పుడు నేను, కథ వింటున్నప్పుడు హీరో, నిర్మాతలు.. తెలియకుండానే హీరోయిన్ లీల అనుకున్నాం. ‘గ్యాంగ్ లీడర్’లో చిరంజీవి, -విజయశాంతి మధ్య సన్నివేశాలు ఎలాగైతే కామెడీ టచ్‌తో మాసీగా ఉంటాయో.. ఇందులో రవితేజ, శ్రీలీల మధ్య సన్నివేశాలు అలా ఉంటాయి. 

ఇక నా అప్‌కమింగ్ ప్రాజెక్టుల గురించి చెప్పాలంటే.. రచయితగా కొన్ని సినిమాలు చేస్తున్నా. దర్శకుడిగా రెండో సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నా. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తా.