calender_icon.png 11 September, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 13న కుక్కల దత్తత

11-09-2025 05:58:05 PM

స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్  నారాయణ అమిత్ 

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ఇటీవల కాలంలో ప్రజలపై వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్న దృష్ట్యా అవగాహనతో పాటు, వ్యాక్సినేషన్, కుక్కల పట్ల ప్రేమ, దయ చూపించే వారికి నల్గొండ జిల్లాలో ఈనెల 13న కుక్కల దత్తత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్(Additional Collector Narayan Amit) తెలిపారు. గురువారం అయన కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల కాలంలో కుక్కలు ప్రజలపై దాడి చేసి గాయపరుస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయని, అయితే దీనికి ఒక శాస్త్రీయ పరిష్కారం లో భాగంగా నల్గొండ జిల్లా యంత్రాంగం వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ తో పాటు, స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా, కుక్కల పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించడం, కుక్కలు కరవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ కుక్క కరిస్తే వాక్సినేషన్ తీసుకోవడం, రేబిస్ వ్యాధి సోకాకుండా చూసుకోవడం, వంటి జాగ్రత్తలను ఒకవైపు తెలియజేస్తూనే కుక్కల పట్ల దయ, కరుణ చూపే విధంగా ఎవరైనా కుక్కల ప్రేమికులు ఉన్నట్లయితే వారికి వీధి కుక్కలను దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. 

13న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ సమీపంలో ఉన్న రామగిరి మున్సిపల్ పార్కులో కుక్కల దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు. కుక్కల దాడుల నివారణలో భాగంగా నల్గొండ జిల్లాలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం ద్వారా స్టెరిలైజేషన్ కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇదే తరహాలో మిర్యాలగూడలో సైతం 50 లక్షల రూపాయలతో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ఇటీవలే మిర్యాలగూడ శాసనసభ్యులు, ఎమ్మెల్సీ శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. స్టేరిలైజేషన్తోపాటు జిల్లాలోని అన్ని మండలాలలో వ్యాక్సినేషన్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి మండల కేంద్రంలో కుక్కల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవగాహన, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ పై పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని ,అలాగే మున్సిపల్ లో కార్యాలయంలో సైతం భారీ ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.

గత రెండు వారాల క్రితం దేవరకొండ డివిజన్లో చేపట్టిన అవగాహన కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని నల్గొండ మున్సిపాలిటీలో 13వ తేదీ ఉదయం 7 గంటలకు రామగిరి మున్సిపల్ పార్కులో నిర్వహించే  కుక్కల దత్తత కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కుక్కలను దత్తత తీసుకోవాలని కోరారు.  సుమారు 50 కుక్కలు దత్తత ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటుండగా, ఇంకా ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే 100 కుక్కల వరకు దత్తత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్ ,మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, తదితరులు ఈ మీడియా ప్రతినిధుల సమావేశానికి హాజరయ్యారు.