29-10-2025 12:00:00 AM
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తుంటే, మరోవైపు తెలంగాణపై కూడా దాని ప్రభావం కనిపిస్తోంది. రాగల మూడు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తూ, జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. బుధవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 50 కి.మీ.ల వేగంతో కూడిన ఈదురు గాలులతో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూ బాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో గంటకు 40 కి.మీ.ల వేగంతో ఈదురు గాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
అలాగే కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, యా దాద్రి భువనగిరి, జనగాం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 30 కి.మీ.ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని హెచ్చరిస్తూ ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
గురువారం అతి భారీ వర్షాలు
గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40 కి.మీ.ల వేగంతో ఈదురు గాలులతో కూ డిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, జిల్లాలలో కురిసే అవకాశముంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యా దాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
శుక్రవారం భారీ వర్షాలు
శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 కి.మీ.ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురువనున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచి ర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిలాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.