23-04-2025 12:00:00 AM
ఎల్లో అలర్ట్ జారీచేసిన వాతావరణ కేంద్రం
మంగళవారం 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
సాధారణం కంటే 2 డిగ్రీలు అధికం
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 3.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మంగళవారం 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడం గమనార్హం. రాబోయే మూడు రోజులు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. బుధ, గురు, శుక్రవారాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
అయితే సాయంత్రానికల్లా ఉరుములు, పిడుగులతో కూడిన చిరుజల్లులు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తగా ఉండాలని, 45 డిగ్రీలు కూడా దాటే అవకాశం స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని హెచ్చరికలు జారీచేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.
ఈ నెల 26 నుంచి ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా అతి తక్కువగా హైదరాబాద్‌లో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 41.6 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.