30-01-2026 01:34:15 AM
ఆసిఫాబాద్ పీఠం కోసం మూడు పార్టీలు పట్టు
అధికార కాంగ్రెస్ పట్టు నిలుపుకునే యత్నం..
బీజేపీ, బీఆర్‌ఎస్ దూకుడు వ్యూహాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ పీఠం ఇప్పుడు మూడు పార్టీలకు రాజకీయ ప్రతిష్ఠ యుద్ధంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైనా పీఠాన్ని వదులుకోకుండా ఉండేందుకు తెరవెనుక రాజకీ యాలు చేస్తుండగా, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు మాత్రం ఈసారి ఆసిఫాబాద్ మనదే అన్న నినాదంతో రంగంలోకి దిగాయి. మున్సిపాలిటీలో కీలకంగా మారిన కొందరు కౌన్సిలర్ల ఆశావాహుల చుట్టూ మూడు పార్టీల నేతలు తిరుగుతున్నారు. దీంతోపాటు కొన్ని వార్డుల్లో ప్రధాన పార్టీలలో తమకంటూ తమకు టికెట్ కేటాయించాలని పార్టీ నేతలపై ఒత్తిడి తీసుకొస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.
అధికార కాంగ్రెస్ నేతలు హామీలతో తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుండగా బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు రాజకీయ లాభాల ఆశ చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రజలకు అభివృద్ధి పేరుతో మాటల వర్షం కురిపిస్తున్న నేతలు, వాస్తవానికి మాతం పీఠం లెక్కలకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్లు ధ్వంసం, తాగునీటి ఇబ్బందులు, పారిశుధ్య లోపాలు రోజురోజుకూ పెరుగుతుంటే, నేతలు మాత్రం పీఠం కోసం పావులు కదుపుతున్నారు.
పీఠం దక్కితే జిల్లాపై పట్టు..
మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇప్పుడు కేవ లం స్థానిక హోదా కాదు. జిల్లాలో రాజకీయ శక్తి కేంద్రంగా మారింది. ఈ పీఠం దక్కితే రాబోయే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఆధిప త్యం సాధించవచ్చన్న లెక్కలతో పార్టీ అధిష్టానాలే రంగంలోకి దిగినట్లు సమాచారం. మూడు పార్టీల రాజకీయ యుద్ధంలో పట్టణ ప్రజల సమస్యలు మాత్రం అడుగంటుతున్నా యి. చెత్త కుప్పలు, రోడ్ల గుంతలు, నీటి కొరత పై ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆగ్రహం ప్రజల్లో పెరుగుతోంది. పీఠం ఎవరిది అన్నది కాదు.. పట్టణం ఎప్పుడు బాగుపడుతుంది? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ రాజకీయ పోరులో కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంటుందా..? బీఆర్‌ఎస్ మున్సిపల్‌లో అధికారం చేపడుతుందా.. ? బీజేపీ విజయం సాధిస్తుందా..? అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది.
కాంగ్రెస్ పట్టు.. బీఆర్‌ఎస్ ప్రతీకారం.. బీజేపీ ఎంట్రీ
అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అభివృద్ధి పనుల వేగం పెంచుతున్నట్లు చూపిస్తోంది. బీఆర్‌ఎస్ మాత్రం తమ పాలనలో జరిగిన పనులను గుర్తుచేస్తూ, కాంగ్రెస్ పాలనలో పట్టణం వెను కబడింది అంటూ ప్రజల్లో అసంతృప్తిని రెచ్చగొడుతోంది. బీజేపీ అయితే కేంద్ర ప్రభుత్వ పథకాల బలం చూపిస్తూ, తొలిసారి మున్సిపాలిటీలో కీలక స్థానం దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది.