03-11-2025 05:22:43 PM
విషాదంలో పేర్కొంపల్లి...
తాండూరు (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, పీర్జాదిగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయాన్నే ఉద్యోగాలు, చదువులు, ఇతర పనుల నిమిత్తం బస్సు ఎక్కిన వారికి అదే చివరి ప్రయాణం అయ్యింది. ఏం జరిగిందో తెలిసే లోపే అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. బస్సు ప్రమాద ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం పేర్కొంపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఈ దుర్ఘటనలో మృతిచెందారు.
ఈరోజు (సోమవారం) ఉదయం ముగ్గురు అక్కా చెల్లెళ్లను కన్న తండ్రి ఎల్లయ్య గౌడ్ ఉదయం 4 గంటల 40 నిమిషాలకు తాండూరు బస్సు స్టాండ్ లో స్వయంగా బస్టాప్‌లో దింపి వెళ్లాడు. తండ్రికి చిరునవ్వుతో బాయ్ చెప్పిన ఆ సోదరీమణులకు అదే ఆఖరి ప్రయాణం అని తెలీదు. ఎంతో సంతోషంగా బస్సు ఎక్కి ప్రయాణం సాగించారు. కానీ అంతలోనే బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు స్పాట్‌లో మృతిచెందారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని తమ బిడ్డల కోసం ఆరా తీయగా.. వారు చనిపోయినట్లు తెలియడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.
మృతులు సాయిప్రియ, తనుషా, నందినిగా గుర్తించారు. ఈ ముగ్గురు కూడా హైదరాబాద్‌లోని కాలేజీల్లో బీటెక్ మూడు, బీటెక్ రెండవ, మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరి తండ్రి ట్రావెల్స్ నిర్వహిస్తూ డ్రైవర్ జీవనం సాగిస్తున్నాడు. గత నెలలోనే పెద్ద కుమార్తె వివాహం జరిపించాడు. ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో మిగిలిన ముగ్గురు బిడ్డలు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. చదువులో గ్రామస్తులతో కుటుంబంలో చలాకీగా ఉండే ముగ్గురు అక్కచెల్లెళ్లు కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.