calender_icon.png 8 August, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంచెత్తిన వాన

08-08-2025 12:50:43 AM

చెరువులను తలపించిన హైదరాబాద్ రహదారులు

  1. గంటల తరబడి స్తంభించిన ట్రాఫిక్ 
  2. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 12.35 సెం.మీ.ల వర్షపాతం 
  3. మరో నాలుగు రోజులు వర్షాలే! 
  4. అప్రమత్తంగా ఉండండి 
  5. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరాన్ని గురువారం కురిసిన కుండపోత వాన ముంచెత్తింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడినట్టు కురిసిన వర్షానికి మహానగరం తడిసి ముద్దయింది. దాదాపు గంటపాటు ఏకధాటిగా దంచి కొట్టిన వానకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దారి కనిపించనంతగా కురిసిన వానతో ఎక్కడికక్కడ గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది.

అత్యధికంగా శేరిలింగంపల్లిలో 12.35 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. నగరంలోని ప్రధాన రహదారులన్నీ నదులను తలపించగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం బీభత్సం సృష్టించడంతో వాహనదారులు, ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకు పోయారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో నగరాన్ని కారుమబ్బులు కమ్మేసి, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది.

ఖైరతాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, పాతబస్తీ సహా దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. మెహిదీపట్నం నుంచి లింగంపల్లి, సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ వరకు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఖైరతాబాద్, అమీర్‌పేట మైత్రీవనం కూడళ్లు చిన్నపాటి చెరువులను తలపించాయి.

అనేక అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరి వాహనాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో అంధకారం అలుముకుంది. వర్ష బీభత్సం నేపథ్యంలో జీహెఎంసీ, హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎఫ్, జలమండలి, పోలీసు బృందాలు తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. నగరంలో గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీటిని తోడేసే పనులను ముమ్మరం చేశాయి.

సహాయక చర్యలపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాతావరణ శాఖ నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందని, రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని బల్దియా కమిషనర్ ఆర్.వి. కర్ణన్ విజ్ఞప్తి చేశారు.

నమోదైన వర్షపాతం వివరాలు 

శేరిలింగంపల్లి- 12.35 సెం.మీ., ఖైరతాబాద్- 11.13 సెం.మీ., ఖైరతాబాద్- 10.85 సెం.మీ., గండిపేట్- 10.68 సెం.మీ., సరూర్‌నగర్- 10.60 సెం.మీ., ఖైరతాబాద్- 10.40 సెం.మీ.లుగా నమోదైంది. 

అత్యవసరమైతేనే బయటికి రండి: మేయర్ విజయలక్ష్మి 

హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కు రుస్తాయని వాతావరణ కేంద్రం ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశించారు. జోనల్ కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ విభాగాల ఉన్నతాధికారులు, డిప్యూటీ కమిషనర్‌లతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని సూచించారు.

పిడుగుపాటుకు ఇద్దరికి గాయాలు

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం దంచి కొట్టిం ది. కౌటాల మండలం బోధన్ పల్లి గ్రామంలోని పులబోయిన మల్లేష్, ధోని అభిపై పిడుగు పడటంతో గాయాల పాలయ్యారు. మల్లేష్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఇంటి పిల్లర్ పని జరుగుతుండగా వర్షం కురిసింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న మల్లేష్, అతడి స్నేహితుడు ధోనిపై పిడుగు పడింది. మల్లేష్ ఎడమ కాలుకు తీవ్రంగా గాయాలు కాగా అభికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణంలోని కాలనీల రోడ్లు జలమయం అయ్యాయి. 

పొంగిన బుగ్గ వాగు 

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురిసింది. డోర్నకల్ మండలంలో కురిసిన వర్షానికి డోర్నకల్  గ్రామాల మధ్య బుగ్గ వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. దీనితో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

మరో నాలుగు రోజులు వర్షాలే! 

రానున్న నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం నల్లగొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇక ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కురుస్తాయని సూచించింది.

శనివారం నల్గొండ, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఈమేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.