16-12-2024 12:00:00 AM
ఎండాకాలం వచ్చిందంటే చాలు విసనకర్ర ప్రతి ఇంట్లో ప్రత్యక్షమయ్యేది. పిల్లలు పడుకుంటే నిద్ర లేవకుండా అమ్మమ్మ, తాతయ్యలు విసనకర్రతో విసిరిన జ్ఞాపకాలు అనేకం. ఉస్సో ఉస్సో అనుకుంటూ చమటలు కక్కుకుంటూ కరెంటులేదని తిట్టుకుంటూ విసనకర్రను వాడేవారు. అదేపనిగా ఊపడంతో చేతులు బాగా నొప్పి పుట్టేవి. అయినా ఆ కొద్దిపాటి గాలి ఎంతో హాయినిచ్చేది. వీటి తర్వాత ఫ్యాన్లు, ఏసీలు అందుబాటు లోకి రావడంతో విసనకర్రలు కనుమరుగయ్యాయి. అయితే ఇప్పటికీ కొన్ని పల్లెటూర్లలో ఈ విసనకర్రలు కనిపిస్తుంటాయి.
దాహం తీర్చిన చేతిపంపు
చేతిపంపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనినే బోరింగ్ పంపు అని కూడా అంటారు. గ్రామీణ మహిళలను నీటి కష్టాలు వెంటాడి న సమయంలో ఈ చేతిపంపులే ఆదుకున్నాయి. చేతులు నొప్పి పుట్టేదాగా ఈ చేతి పంపు కొట్టి బిందెలలో నీళ్ళు నింపుకుని తీసుకెళ్ళే వారు. బిందెడు నీళ్ల కోసం ఎక్కడ చేతి పంపు ఉంటే అక్కడికి వెళ్లేవారు. ఒపికగా పంపును కొట్టి నీళ్లు పట్టుకునేవారు. ప్రస్తుతం నీటిని తోడే ఎన్నో సాధానాలు ఉన్నప్పటికీ, చేతిపంపులు మారుమూల గ్రామాల్లో దర్శనమిస్తూనే ఉన్నాయి. కానీ వీటిని కొట్టి నీళ్ళు పట్టుకునేంత ఓపిక లేకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి.