01-10-2025 01:15:49 AM
సోషల్ మీడియాలో ప్రచారంపై ప్రత్యేక దృష్టి
రాజకీయ పార్టీల నేతల సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ వెల్లడి
ఆదిలాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాం తి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందనీ, రాజకీయ పార్టీల నేతలు సైతం నిబంధనల పాటించాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్, ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్నికల నియమావళి అనుసరించి జిల్లా స్థాయి అధికారులు అందరిని నోడల్ అధికారులుగా నియమించి ఆదేశాలు జారీ చేయడం జరిగిందాని అన్నారు.
ఎన్నికల నియమావళినీ తూచ తప్పకుండా పాటించాన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వచ్చినందున నిర్వహణకు కావలసిన ఏర్పాట్లు, బందోబస్తు, అధికారులు, సిబ్బంది నియామకం, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, రక్షణ ఏర్పాట్లు ఇతర ఎన్నికల అంశాలకు సంబంధించి అధికారులు ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు.
ఓటర్లను ప్రభావితం చేసే ప్రచార అంశాలను వెంటనే తొలగించాలని, మీడియాలో వచ్చే ప్రకటనలు, సోషల్ మీడియాలో ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జెడ్.పి.టి.సి., ఎం.పి.టి.సి. ఎన్నికలు ప్రతి జిల్లాలో రెండు విడతలలో నిర్వహించడం జరుగుతుందని, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు ఎంపిక చేయబడిన జిల్లాలలో మూడు విడతలుగా, మిగతా జిల్లాలలో రెండు విడతలుగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఎన్నికల నోటీసు జారీ, ఓటర్ల జాబితా ప్రదర్శన, నామినేషన్ల దాఖలు, పరిశీలన, చెల్లుబాటయ్యే నామినేటెడ్ అభ్యర్థుల జాబితా, అప్పీలు, అప్పీళ్ల పరిష్కరణ, అభ్యర్థిత్వం ఉపసంహరణ, పోటీ చేయు అభ్యర్థుల జాబితా ప్రచురణ, పోలిం గ్ నిర్వహణ, రీపోల్ ఉన్నట్లయితే సంబంధిత ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు, ప్రకటన ప్రతి అంశాన్ని ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి నిర్వహించాలని,
ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల నిర్వహణ సజావుగా చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వరరావు, శిక్షణ కలెక్టర్ సలోని, ఆర్డీఓ స్రవంతి, జడ్పి సీఈవో రాథోడ్ రవీందర్, పలువురు అధికారులు, ఆయా రాజకీయ పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు.