14-12-2025 06:46:14 PM
- ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
- ఇల్లందు డీఎస్పీ చంద్రబాను
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలో మూడో విడతలో జరగబోయే పంచాయితీ ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు ఇల్లందు డీఎస్పీ చంద్రబాను, టేకులపల్లి సిఐ సత్యనారాయణ, టేకులపల్లి ఎస్సై రాజేందర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో పోలీస్ శాఖ తరపున పూర్తిస్థాయి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం మండలంలోని రాంపురం గ్రామ పంచాయతీలో పలు పార్టీల రాజకీయ నాయకులతో ఇల్లందు డీఎస్పీచంద్ర భాను, టేకులపల్లి సిఐ సత్యనారాయణ, ఎస్సై రాజేందర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలను చేపట్టడం జరుగుతుందని అన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు కల్పిస్తామన్నారు, ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎవరైనా నగదు, మద్యం వంటి వాటితో పట్టుబడితే చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.