27-04-2025 12:00:00 AM
ఉదయం లేచినప్పటి నుంచి కెరీర్‌కోసం ఉరుకుల పరుగులే. దీనివల్ల ఒత్తిడి సహజంగానే కలుగుతుంది. అయితే శరీరానికి వ్యాయామంతో పాటు మనసుకూ ప్రశాంతత ఉండటంతో పాటు ఒత్తిడి చిత్తవ్వాలంటే యోగా తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
ఆనంద బాలాసనం మనసుకు, శరీరానికి సాంత్వన చేకూర్చే ఆసనం ఇది. వెన్ను ఆరోగ్యానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది.
ఇలా చేయాలి..
వెల్లకిలా పడుకుని కాళ్లు మడవాలి. రెండు కాళ్లూ పైకి లేపి, పాదాల వేళ్లకు రెండు చేతులతో పట్టుకోవాలి. కాళ్లను మరింతగా ఛాతీవైపు లాగి, వెడల్పు చేయాలి. ఈ భంగిమలో వెన్ను చదునుగా ఉంచాలి. ఈ భంగిమలో 30 సెకన్లు ఉండాలి.
బాలాసనం
ఈ ఆసనం యోగాభ్యాసంలో అత్యంత అవసరం. వెన్ను, తొడలు, కాలి గిలకలకు వ్యాయామాన్ని అందించే ఈ ఆసనంతో ఒత్తిడి, ఆందోళనలు అదుపులోకి వస్తాయి.
ఇలా చేయాలి..
మోకాళ్లు, కాలి గిలకల ఆధారంగా కూర్చోవాలి. నుదురు నేలకు తగిలేలా ముందుకు వంగాలి. చేతులు తల మీదుగా శరీరానికి సమాంతరంగా చాపి ఉండవచ్చు లేదా శరీరం పక్కగా చాపుకోవచ్చు. ఊపిరి మీద ధ్యాస ఉంచి, ఈ భంగిమలో 30 సెకన్లు ఉండాలి.
భుజంగాసనం
ఈ ఆసనంతో వెన్ను కండరాల అలసట తొలగిపోయి.. వెన్నుకు రెండు వైపులా ఉండే కండరాలు బలపడతాయి. భుజాల కింది ప్రదేశం, ఛాతీ మధ్య ఉండే ప్రదేశం.. కాళ్లు బలపడతాయి. కంఠం, ఛాతి, భుజాలు వ్యాకోచిస్తాయి.
ఇలా చేయాలి..
పొట్టమీద బోర్లాపడుకోవాలి. పక్కటెముకల దగ్గర చేతులను నేలమీద ఆనించి ఉంచాలి. చేతులు ఆసరగా నడుము పైభాగాన్ని పైకి లేపాలి. ఈ భంగిమలో చూపు పైకి ఉండాలి.
జాగ్రత్తలు..
యోగా చేసే సమయంలో మరీ బిగుతుగా, శరీరానికి అతుక్కుపోయే లాంటి దుస్తులు ధరించకూడదు. ఎందుకంటే వీటివల్ల పక్కటెముకలు, ఊపిరితిత్తులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే మరీ ఎక్కువ నీళ్లు తాగితే శరీరంపై భారం పడుతుంది. తద్వారా వ్యాయామాలకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి నీళ్లు తగిన మోతాదులో తాగడం మంచిది.