15-08-2025 12:13:02 AM
సమీక్ష
సినిమా పేరు: కూలీ
నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, సౌబిన్ సాహిర్, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతిహాసన్;
సంగీతం: అనిరుధ్ రవిచందర్;
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్;
కెమెరా: గిరీశ్ గంగాధరన్;
నిర్మాత: కళానిధి మారన్;
నిర్మాణం: సన్ పిక్చర్స్;
రచనాదర్శకత్వం: లోకేశ్ కనగరాజ్;
విడుదల: 14 ఆగస్టు, 2025.
రజనీకాంత్ హీరో.. నాగార్జున విలన్.. ప్రత్యేక ఆకర్షణగా ఆమిర్ ఖాన్, ఉపేంద్ర రోల్స్. అనిరుధ్ సంగీత సారథ్యం. రజనీకాంత్‌ను లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా.. అందుకే ‘కూలీ’పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. గురువారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షిస్తే.. కథ ఏంటంటే.. సైమన్ (నాగార్జున) ఓ పేరు మోసిన స్మగ్లర్. ఓ షిప్‌యార్డ్ అడ్డాగా తన కార్యకలాపాలు కొనసాగిస్తుంటాడు.
స్మగ్ల్‌గూడ్స్, బంగారం అక్రమంగా ఎగుమతి, దిగుమతులు అతని వృత్తి. దయాళ్ (సౌబిన్ షాహిర్) అతనికి నమ్మిన బంటు. దయాళ్ కనుసన్నల్లోనే సైమన్ అక్రమ దందాలన్నీ జరుగుతుంటాయి. తమ అక్రమాల గురించి తెలుసుకునే వాళ్లను వేటాడి చంపేస్తాడు. కానీ డెడ్‌బాడీలను సాక్ష్యాధారాల్లేకుండా చేయడం సైమన్ అనుచరులకు సవాల్‌గా మారుతుంది. ఇదిలా ఉండగా రాజశేఖర్ (సత్యరాజ్) తయారుచేసిన ఓ ఎలక్ట్రిక్ కుర్చీతో మంచి కన్నా చెడు జరిగే అవకాశమే ఎక్కువ అంటూ ప్రభుత్వం దాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు అనుమతి ఇవ్వదు.
ఆ బాధలో ఉన్న రాజశేఖర్‌కు సైమన్ నుంచి పిలుపు వస్తుంది. తాను చంపిన శవాలను భస్మం చేసేందుకు ఆ చైైర్ తనకు తయారుచేసి ఇవ్వాలని, లేకపోతే తన ముగ్గురు కూతుళ్లను చంపుతానని రాజశేఖర్‌ను సైమన్ భయపెడతాడు. అలా తప్పనిసరై రాజశేఖర్.. సైమన్‌తో చేయి కలుపుతాడు. తన కుమార్తె ప్రీతి (శ్రుతిహాసన్)తో కలిసి రాజశేఖర్ పనిలోకి దిగుతారు.
అనుకోకుండా రాజశేఖర్ మరణిస్తాడు. ఆ వార్త విన్న రాజశేఖర్ ప్రాణ స్నేహితుడు దేవా (రజనీకాంత్) షాక్ అవుతాడు. రాజశేఖర్ కుమా ర్తెలు ప్రమాదంలో ఉన్నారని తెలియడంతో వాళ్లకు అండగా ఉంటాడు దేవా. రాజశేఖర్‌ను చంపిందెవరు? స్నేహితుడి కూతు ళ్లను కాపాడే క్రమంలో దేవా ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? అసలు ఈ దేవా ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథను విశ్లేషిస్తే.. స్నేహితుడి కుటుంబానికి అండగా నిలువడం అనేది పాత కథే అయి నా, దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తనదైన రీతిలో కథను చెప్పడానికి ప్రయత్నించారు. దేవా, రాజశేఖర్ మధ్య స్నేహం ఎలా ఏర్పడింది? వాళ్లిద్దరూ విడిపోవడానికి కారణ మేంటి. దేవా 30 ఏళ్ల తర్వాత రాజశేఖర్ జీవితంలోకి ఎందుకొచ్చాడు? ఇవన్నీ ఈ కథలో ఆసక్తికరమైన విషయాలు.
రజనీకాంత్ క్యారెక్టరైజేషన్ మరోస్థాయిలో డిజైన్ చేశారు లోకేశ్. తనది కాని సమస్యలోకి తలదూర్చి, ప్రమాదాలతో ఆడుకుంటూ.. రాజశేఖర్ కుమార్తెలను కాపాడుకుంటూ వెళ్తున్న దేవా ను ఫస్టాఫ్‌లో చూసే ప్రేక్షకులకు.. సెంకాడాఫ్‌కు వచ్చేసరికి అసలు అది తన సమస్యేనని తెలుస్తుంది. ఆ సమస్య ఏంటనేది కథలో కీ పాయింట్. అయితే.. కొన్ని సన్నివేశాలు కృతకంగా అనిపిస్తాయి.
మొత్తం సిని మా అయితే ఆకట్టుకునేలాగే ఉంది. ప్రథమార్ధంలో ట్విస్టు లు ద్వితీయార్ధంపై ఆసక్తిని రేకెత్తిస్తాయి. సెకం డ్ హాఫ్‌లో చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పే క్రమం పర్వాలేదనిపిస్తుంది. మొత్తంగా సినిమాకు కథనం ప్రధాన బలం. కథ విషయం లో ఇంకొంత కసరత్తు చేస్తే బాగుండేది.
ఇక నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. దేవాగా రజనీకాంత్ నటనకు అభిమానులు ఉర్రూతలూగిపోవడం పక్కా. శక్తిమంతమైన యాక్షన్ ఎలిమెంట్స్, ఎమోషన్స్‌తో అదరగొట్టేశారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ యాక్షన్ సీక్వెన్స్‌లో అభిమానునలకు వింటేజ్ తలైవా కనిపిస్తారు. తొలిసారి విలన్‌గా చేసిన నాగార్జున లుక్ స్టుటైలిష్‌గా ఉంది. సైమన్ పాత్రలో కొత్త విలనిజాన్ని వెండితెర పై ప్రదర్శించారాయన.
ఉపేంద్ర, ఆమిర్‌ఖాన్‌ల అతిథి పాత్రలు సినిమాకు కలిసి వచ్చాయి. ఇందులో మరో కీలక పాత్ర సౌజిన్ షాహిర్ నటన అద్భుతం. శ్రుతిహాసన్ చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో కనిపించింది. సత్యరాజ్ బాగా నటించారు. పూజ హెగ్డే ప్రత్యేక గీతం సినిమాకు ఓ ఆకర్షణ. అనిరుధ్ సంగీతం అదరహో అనిపించింది. కెమెరా వర్క్ కూడా చాలా బావుంది. నిర్మాణ విలువలు ఆద్యంతం బాగున్నాయి.