15-08-2025 12:10:11 AM
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక సెప్టెంబర్ 5, 6 తేదీల్లో దుబాయ్‌లో జరగనుంది. ఈ వేడుక నిర్వాహకులు హైదరాబాద్‌లో గురువారం ప్రెస్‌మీట్ ఏర్పాటుచేశారు. ఇటీవల నేషనల్ అవార్డులకు ఎంపికైన సినీప్రముఖులను సత్కరించారు. సన్మానం పొందినవారిలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి (భగవంత్ కేసరి), దర్శకుడు సాయి రాజేశ్, సింగర్ రోహిత్ (బేబీ) దర్శకుడు ప్రశాంత్‌వర్మ, విజువల్ ఎఫెక్ట్స్ వెంక ట్ (హనుమాన్)లు ఉన్నారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయి.
అందులో ప్రాంతీయ కేటగిరీలో ఐదు వస్తే.. రెండు నేరుగా జాతీయ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ సందర్భాన్ని పండుగలా జరుపుకోవాలి. కానీ, మన సినీ పరిశ్రమ స్పందించలేదు. కారణం అందరికీ తెలిసిందే.. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే! ఇండస్ట్రీ స్పందించి, సత్కరించకముందే ‘సైమా’ గుర్తించడం అభినందనీయం” అన్నారు. అనిల్ రావి పూడి మాట్లాడుతూ.. “ఒరిజినల్ కంటెంట్‌ను బట్టి సైమా అవార్డ్స్ ఇస్తారు.
ఇది కేవలం అవార్డులు వేడుకే కాదు నాలుగు భాషల సినీ టాలెంట్‌ను కనెక్ట్ చేస్తుంది” అన్నారు. “సైమా’ టాలెంట్‌ను సెలబ్రేట్ చేసుకునే చాలా గొప్ప వేదిక” అని ప్రశాంత్ వర్మ అన్నారు. ‘నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత తొలి గుర్తింపు సైమా ఇచ్చిందే’నని సాయి రాజేశ్ చెప్పారు.
సైైమా చైర్‌పర్సన్ బృందా మాట్లాడుతూ.. “మరో రీయూనియన్‌కు సైమా సిద్ధమైంది. 13 ఏళ్లంటే లాంగ్ జర్నీ. 13వ ఎడిషన్‌కు చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. సైమా కేవలం అవార్డు వేడుక కాదు. టాలెంట్‌ను, కల్చర్‌ను సెలబ్రేట్ చేసుకునే గ్లోబల్ స్టేజ్” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్, హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, మంచు లక్ష్మి, వేదిక తదితరులు పాల్గొన్నారు.