27-10-2025 12:59:31 AM
‘కంగువ’తో భారీ విజయాన్ని అందుకున్నారు కోలీవుడ్ స్టార్ సూర్య. ఆ తర్వాత వచ్చిన ‘రెట్రో’ మాత్రం ఆయనకు సంతృప్తికర విజయాన్ని అందించలేకపోయింది. ఒక సినిమాతో విజయం, మరో సినిమాతో పరాజయం.. రెండు ఫలితాలు చూసిన సూర్య ఇప్పుడు తన 46వ సినిమా కోసం పనిచేస్తున్నారు. ‘సూర్య46’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు సూర్య. అయితే, ఇటీవల తమిళులు తెలుగువారితో, టాలీవుడ్ వారు కోలీవుడ్ వారితో అన్నట్టు రెండు ఇండస్ట్రీల హీరోలు, దర్శకుల కాంబో ట్రెండ్‌గా మారింది.
ఈ ట్రెండ్‌లో భాగమే సూర్య అట్లూరి కలయిక. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ ‘సూర్య46’ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘లక్కీ భాస్కర్’ తర్వాత వెంకీ అట్టూరితో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న రెండో చిత్రమిది.
ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ రవీనా టాండన్ భాగమైంది. ఆదివారం టాండన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ‘బంగారు బుల్లోడు’, ‘ఆకాశ వీధిలో’ వంటి సినిమాల్లో టాలీవుడ్ సీనియర్స్ బాలకృష్ణ, నాగార్జునలతో రొమాన్స్ చేసిన రవీనా టాండన్..
ఆ తర్వాత తెలుగు పరిశ్రమలో కనిపించలేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా హవా కొనసాగించిన రవీనా మళ్లీ ‘కేజీఎఫ్2’తో రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సూర్య అట్లూరి కాంబినేషన్ మూవీతో 24 ఏళ్ల తర్వాత మళ్లీ నేరుగా టాలీవుడ్‌లో మళ్లీ అడుగుపెడుతోంది. ఈ ‘సూర్య46’లో రవీనా ఓ శక్తిమంతమైన పాత్రలో అలరించేందుకు సిద్ధం కావటం పట్ల అంతటా ఆసక్తి నెలకొంది.