17-09-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తున్నది. భారీ వర్షాలు, వరదల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. జనజీవనం అతలాకుతలమైంది. పలువురు వరదల్లో చిక్కుకోగా, రెస్క్యూ బృందాలు వారిని కాపాడాయి. మరికొందరు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మంగళవారం క్లౌడ్‌బరస్ట్ సంభ వించి భారీ వర్షం కురిసింది.
పిడుగుపాటుకు నలుగురు మృతిచెందారు. వరదల్లో ఇద్దరు గల్లంతయ్యారు. అధికారులు సుమారు 900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హిమాచల్ ప్రదేశ్‌లో మూడు జిల్లాల్లో వర్షప్రభావం ఎక్కువగా ఉంది. కొండచరియల విరిగిపడి ముగ్గురు మృతి చెందారు. మండీ జిల్లాలో కొండచరియలు విరిగిపడి పేదల ఇల్లు నేలమట్టమయ్యాయి. హిమ్‌ల్యాండ్, శిమ్లా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి వాహనాలు ధ్వంసమయ్యాయి.
జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో కొండచరియలు విరిగిపడి కోట్రంకా-ఖవాస్ ఘాట్‌రోడ్డు దెబ్బతింది. సిక్కింలోని గాయిగిన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఒక వ్యకి మృతిచెందాడు. మణిపూర్‌లోని ఇరిల్, తౌబల్ నదులకు గండ్లు పడ్డాయి. ఫలితంగా ఇంపాల్ తూర్పు, తౌబల్ జిల్లాలు ప్రభావితమయ్యాయి. వందలాది ఇళ్లు, రోడ్లు, బ్రిడ్జిలు వరదలకు కొట్టుకుపోయాయి.