02-12-2025 12:00:00 AM
-పలు జీపీలో ఏకగ్రీవం కోసం ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు
-లక్కీగా మారిన రిజర్వేషన్లు
-తండాల్లోనే ఏకగ్రీవం ఎక్కువ
వికారాబాద్, డిసెంబర్- 1 : జిల్లాలోని పలు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం వైపు అడుగులు వేస్తున్నాయి. ఎన్నికల బరిలో నిల్చుని విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టుకోవడం, మానవ సంబంధాలను దెబ్బ తీసుకోవడం కంటే ఏకగ్రీవమే మేలని భావిస్తున్నారు.
పైగా ఏకగ్రీవమైన జిపి లకు ప్రత్యేక నిధులు ఇస్తామని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటిస్తుండటం, సర్పంచ్ అభ్యర్థులు ఏకంగా తమ వంతు గ్రామాభివృద్ధికి ఇన్ని లక్షలు ఇస్తామని ముందే ప్రకటిస్తుండడం తో ఆయా గ్రామస్తులు ఏకగ్రీవం వైపు ఆలోచిస్తున్నారు. జిల్లాలో 594 జిపి లు ఉండగా ఇప్పటివరకు 21 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పలు జిపిల్లో ఒక్కరు చొప్పున సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయడంతో గెలుపు లాంచనమైంది. స్క్రూట్ ని అనంతరం ఇప్పటికే కొన్ని జీపీలను అధికారికంగా ప్రకటించగా, మరికొన్ని జిపి లను ప్రకటించాల్సి ఉంది.
ఏకగ్రీవంలో తండా జీపీలే అధికం..
ఏకగ్రీవం అవుతున్న జిపి లో అత్యధికంగా తండాలే ఉండటం గమనార్హo. పెద్ద జీపీలలో పోటీ తీవ్రంగా ఉండడంతో ఏకగ్రీవం సాధ్యపడటం లేదనే ప్రచారం జరుగుతుంది. బషీరాబాద్ మండలంలో మూడు, యాలాల్ మండలంలో ఐదు, దుద్యాల్, తాండూర్ మండలంలో ఒకటి చొప్పున, పెద్దేముల్ మండలంలో రెండు, బొమ్రాసి పేట మండలం నుంచి ఆరు పంచాయతీ లు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ నాటికి మరికొన్ని పంచాయతీలు ఏకగ్రీవమయే అవకాశమున్నట్లు తెలుస్తుంది.
బషీరాబాద్ మండలంలోని మూడు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. హంకే నాయక్ తండాలో సర్పంచ్ స్థానానికి అన్ని వార్డులకు ఒక్కరే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఆ స్థానాలు యునాని మస్ అయ్యాయి. స్కూటీని అనంతరం అధికారికంగా ప్రకటిస్తారు.
లక్కీ రిజర్వేషన్..
ఎన్నో రోజులుగా సర్పంచ్ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్న నాయకులకు రిజర్వేషన్లు నిరాశే మిగిల్చాయి. ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు రిజర్వేషన్ల కారణంగా సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యుల పదవులు దక్కుతున్నాయి. మంతన్ గౌడ్ గ్రామంలో ఎస్టి రిజర్వుడు కావడంతో ఎరుకలి సామాజిక వర్గానికి చెందిన ఒకే కుటుంబం నుండి భీమప్ప ఒక్కడే సర్పంచ్ స్థానానికి నామినేషన్ చేశారు. రెండు వార్డు స్థానాలు కూడా ఎస్టీ రిజర్వుడ్ కావడంతో భీమప్ప కొడుకు ఎరుకలి మహేష్, కోడలు ఎరుకలి సుజాత నామినేషన్ చేశారు. వారి గెలుపు లాంచనమైనది. దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురికి పదవులు వరించాయి.
వేలం పాటలు ఏకగ్రీవం...
ఏదో రకంగా సర్పంచ్ గిరిని దక్కించుకోవాలనుకుంటున్న నాయకులు ఏకగ్రీవం అయ్యేందుకు నాన్న తండాలు పడుతున్నారు. ఏకగ్రీవం చేసి సర్పంచి పదవిని కట్టబెడితే గ్రామ అభివృద్ధికి లక్షల్లో ఇస్తానని గ్రామస్తులకు మాట ఇస్తున్నారు. దీంతో జిల్లాలోని పలు గ్రామాల్లో ఇప్పటికే ఇలాంటి ఏకగ్రీవాలు జరిగాయి. అంతేకాకుండా ఏకగ్రీవ పంచాయతీల అభివృద్ధికి రూ. 10 లక్షలు, పెద్ద జీపీలకు రూ. 20 లక్షలు కేటాయిస్తామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
దీంతో హం క్యా నాయక్ తండా, బాబు నాయక్ తండ ప్రజలు గ్రామసభలు ఏర్పాటు చేసుకొని యునాని మస్ గా చేసుకోవాలని నిర్ణయించారు. హంకా నాయక్ తండా నుంచి సర్పంచ్ స్థానాలకు అనిత రాథోడ్ తో పాటు ఆరు వాడు స్థానాలకు ఒక్కరు చొప్పున మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. బాబు నాయక్ తాండ నుంచి సర్పంచి స్థానానికి జేర్పుల అనిత తో పాటు 8 మంది వార్డు స్థానాలకు ఒక్కరు చొప్పున మాత్రమే నామినేషన్ చేయించారు. దీంతో అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. యాలాల్ మండలంలోని మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
ఆయా జిపిలో సర్పంచ్ వార్డు స్థానాలకు ఒక్కొక్కరి చొప్పున నామినేషన్లు చేశారు. దీంతో వారు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. సంగం కురుదు పంచాయితీ జనరల్ కు రిజర్వేషన్ ఖరారు కాగా ఆ గ్రామానికి చెందిన సంగం సుధాలక్ష్మి సర్పంచ్ స్థానానికి నామినేషన్ చేశారు. లక్ష్మీనారాయణ పల్లి జిపి జనరల్ మై లకు కేటాయించడంతో గుర్రాల నాగమణి ఒక్కరే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
కృష్ణాపూర్ పంచాయతీ ఎస్సి మహిళలకు రిజర్వ్ కావడంతో ఆ గ్రామానికి చెందిన స్వప్న ఒకరే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మండలంలో 35 గ్రామ పంచాయతీలు ఉండగా 6జేపీ లు ఏకగ్రీవమయ్యాయి. నాగిరెడ్డిపల్లి పంచాయతీ నుండి నందిగామ అనిత సర్పంచ్ స్థానానికి, బాలరాజు ఉపసర్పంచిగా 8 వార్డులకు ఒక్కరు చొప్పున నామినేషన్ దాఖలు చేశారు. జానకంపల్లి జిపి నుండి సానవోని చిన్న వెంకటయ్య సర్పంచ్ స్థానానికి, శ్రీనివాస్ గౌడ్ ఉప సర్పంచ్ గా ఆరు వార్డు స్థానాలకు ఒక్కొక్కరు చొప్పున నామినేషన్ చేశారు.
సాలిందాపూర్ పంచాయతీ నుంచి విక్కీ బాయ్ సర్పంచ్ స్థానానికి 8 మంది వార్డు స్థానాలకు నామినేషన్లు వేశారు. మదనపల్లి తండా జిపి నుండి శంకర్ నాయక్ సర్పంచ్ స్థానానికి, ఆరు వార్డు స్థానాలకు ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు చేశారు. టేకుల గడ్డ తాండ నుండి లక్ష్మీబాయి సర్పంచ్ స్థానానికి ఆరుగురు వార్డు స్థానాలకు నామినేషన్ చేశారు. కట్టుకరు తాండ నుంచి కిషన్ నాయక్ సర్పంచ్ స్థానానికి జంకు బాయ్ ఉపసర్పంచిగా 8 వార్డు స్థానాలకు నామినేషన్ చేయడంతో వారి ఎంపిక దాదాపు ఖరారు అయింది.
ధరూరు మండల పరిధిలో..
ధరూరు మండల పరిధిలోని అవుసు పల్లి, కొండ పూర్ కుర్దు, నర్సాపూర్, గడ్డమీది గంగారం తో పాటు మరికొన్ని గ్రామాలు ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఏకగ్రీవం అయినా గ్రామాల్లో అభ్యర్థులు గ్రామాభివృద్ధికి ఇచ్చి నిధులను ఆలయాల అభివృద్ధికి ఇతర అభివృద్ధి పనులకు కేటాయించేందుకు గ్రామస్తుల సమక్షంలో ఒప్పంద పత్రం రాసుకుంటున్నారు.