10-08-2025 04:50:09 PM
పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ డిమాండ్
కామారెడ్డి,(విజయక్రాంతి): పెన్షన్ ఆల్ర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. పెన్షనర్ల జేఏసీ మహా ధర్నాకు టీపిటిఎఫ్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ దారుల సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహా ధర్నాకు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి తెలిపారు.
ఈ సందర్భంగా టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెన్షనర్లకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన మంత్రుల ఉప కమిటి, ఆఫీసర్ల కమిటీలు చర్చలకు మాత్రమే పరిమితం అయిపోయాయని అన్నారు. రాష్ట్ర కాబినెట్ నిర్ణయాలకు కూడా విలువ లేకుండా పోయిందన్నారు.
పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పెండింగ్ బిల్లులు,డి ఏ లను వెంటనే విడుదల చేయాలని, పి ఆర్ సి ని వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ఉద్యోగుల పెన్షనర్ల కు నగదురహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని కోరారు. సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు. 398 టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ప్రభు ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.