19-09-2025 12:00:00 AM
-ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోని రుద్విర్ కుమార్
-ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన ధనుంజయ్
ఉప్పల్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): నాచారం సీఐ రుద్విర్‌కుమార్‌ను బదిలీ చేస్తూ రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు గురువారం ఆదేశాలు జారీ చేశారు. నాచా రం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో గత నెల ఆగస్టులో బర్త్‌డే బంప్స్ పేరున తొమ్మిదో తరగతి విద్యార్థిపై తోటి స్నేహితులు దాడి చేశారు. అప్పుడే విద్యార్థి తల్లిదండ్రులు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ సీఐ రుద్విర్ కుమార్ ఫిర్యాదును తీసుకోని స్కూల్‌పై కేసు నమోదు చేయలేదు.
ఇప్పుడు విద్యార్థి పరిస్థితి విషమంగా మారడంతో.. పోలీస్ అధికారులు, స్కూల్ యజ మాన్యంతో కుమ్మక్కై కేసు నమోదు చేయకుండా అలసత్వం వహించారంటూ విద్యార్థి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఇటీవలే కేసు నమోదు చేశారు. అయితే ఆ స్కూల్.. ఓ బీజేపీ ఎమ్మెల్సీది కావడంతో సీఐ రుద్విర్ కుమార్ చర్యలు తీసుకోలేదని తెలుస్తున్నది. అయితే విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళనతో ఈ ఘటన వెలుగులోకి రావడంతో సీఐపై రాచకొండ కమి షనర్ చర్యలు తీసుకున్నారని తెలుస్తున్నది.
సీఐ రుద్విర్ కుమార్‌ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ధనుంజయ్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ధనుంజయ్ గురువారం బాధ్యతలు కూడా స్వీకరించారు. కాగా గత నెలలో కూడా ఇదే ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు మూడు మూగజీవాలను ఢీకొనడంతో అవి చనిపోయాయి. ఈ ఘటన కూడా బయటకు రాకుండా స్కూల్ సెటిల్‌మెంట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీల్లో పెట్రోలింగ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదని, పలువురు నాయకులు వినతిపత్రం అందజేసినా సీఐ పట్టించుకునేవాడు కాదని తెలుస్తున్నది. ఈ ఫిర్యాదులు కూడా సీపీ దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకున్నారని సమాచారం.