calender_icon.png 10 May, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా ప్రజా పాలన ప్రభుత్వం

09-05-2025 12:00:00 AM

-మున్సిపాలిటీలకు కొత్తగా 453 మంది ఇంజినీరింగ్ అధికారులు

-ఏఈ, డీఈ, ఈఈ, ఎస్‌ఈ స్థాయి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం

-అనిరుధ్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానం

-ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల  మే 8 : అత్యవసరంగా అందించే కార్యక్రమాలకు సంబంధించి ప్రజా పాలన ప్రభుత్వం పారదర్శకంగా అడుగులు వేస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలలో ప్రస్తుతం కొత్తగా 453 ఇంజనీరింగ్ అధికారుల నియామకానికి చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఈ మేరకు తాను అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. జడ్చర్ల మున్సిపాలిటీలో ఒక్క రెగ్యులర్ ఏఇఇ  లేరని తెలిపారు. ఏఇఇలు, డిఇఇ లు లేకుండా అభివృద్ధి పనులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు.

ప్రస్తుతం ఒక్కో ఏఇఇ 6 మున్సిపాలిటీలకు ఇంచార్జీలుగా పని చేస్తున్నారని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 21 మున్సిపాలిటీలు ఉంటే ఆ 21 మున్సిపాలిటీలకు కలిపి ఇద్దరు డిఇఇ లే ఉన్నారని, అలాగే 21 మున్సిపాలిటీలకు కలిపి కేవలం ఒకే ఒక్క ఇఇ ఉన్నారని వెల్లడించారు. ఒక ఇఇ 21 మున్సిపాలిటీల్లో జరిగే పనులను పర్యవేక్షించడం సాధ్యమౌతుందా? అని వాపోయారు.

అలాగే ఇక రాష్ట్రం విషయానికొస్తే 5 ఉమ్మడి జిల్లాలకు కలిపి ఒక ఎస్‌ఇ ఉన్నారని, ప్రస్తుతం సౌత్ కు ఒకరు, నార్త్ కు ఒకరు చొప్పున రాష్ట్రంలో కేవలం 2 ఎస్‌ఇ లు మాత్రమే పబ్లిక్ హెల్త్ లో పని చేస్తున్నారని వివరించారు. ఇక ఎస్‌ఇ తర్వాత సిఇ పోస్టులు మంజూరు కాలేదని, ఒక ఇ.ఎన్.సీ. మాత్రం ఇంచార్జ్ గా పని చేస్తున్నారని అనిరుధ్ రెడ్డి వివరించారు.

ఈ నేపథ్యంలోనే తాను అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ, కొత్తగా ఏర్పాటు చేసిన పురపాలికల్లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంజనీరింగ్ పోస్టులను మంజూరు చేయని మాట వాస్తవమేనని చెప్పిందన్నారు. అలాగే ఏఇఇ, డిఇఇ, ఇఇ, ఎస్‌ఇ స్థాయిల్లో 453 ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించిందని అనిరుధ్ రెడ్డి వివరించారు.