24-10-2025 12:09:23 AM
హుస్నాబాద్‌లో ‘సహాస్’ మార్గదర్శనం
హుస్నాబాద్, అక్టోబర్ 23 : దేశంలోని అతి ముఖ్యమైన సవాళ్లలో ఒకటైన ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్)పై యువతలో అవగాహన పెంచాలనే లక్ష్యంతో, గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ’సహాస్’ స్వచ్ఛంద సేవా సంస్థ ఒక విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. కళాశాల ప్రిన్సిపాల్ విజయగిరి బిక్షపతి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. భారత్ అన్ని రంగాల్లో పురోగమిస్తున్నా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది అతి ప్రధానమైన సమస్యగా మారిందన్నారు.
స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాలకు సహాస్ వంటి ఎన్జీవోలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కృషి వల్ల ప్రజల్లో అవగాహన పెరిగి, వారి ప్రవర్తనలో మార్పు వస్తుందని, విద్యార్థులు ఈ సామాజిక బాధ్యతను అర్థం చేసుకొని పాటించాలని సూచించారు. సహాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఇటికాల చిన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశాన్ని వివరించారు.
‘వ్యర్థాలను సరిగా వేరు చేయకపోవడం వల్ల కలిగే ప్రమాదాలు ఎన్నో. కానీ, తడి, పొడి, ప్రమాదకరమైన, ఈ-వేస్ట్ అనే నాలుగు రకాలుగా చెత్తను విభజిస్తే, అదే సంపదగా మారుతుంది‘ అని అన్నారు. గ్రామ పంచాయతీల ద్వారా సేకరించిన ఈ చెత్తను ఏ విధంగా రీసైక్లింగ్, కంపోస్టింగ్ ప్రక్రియల ద్వారా మార్చడం జరుగుతుందో తెలియజేశారు. చెత్తను బహిరంగంగా పడేయడం, తగలబెట్టడం వల్ల పర్యావరణానికి, ఆరోగ్యానికి కలిగే నష్టాలను వివరించారు.
తడి చెత్త నుంచి బయోగ్యాస్, ఎరువులు తయారు చేసే విధానం, పొడి చెత్త రీసైక్లింగ్, ప్రమాదకరమైన చెత్తను సైంటిఫిక్ ల్యాండ్ఫిల్ చేసే విధానాలను చర్చించారు. ప్లాస్టిక్ నివారణకు ప్రత్యామ్నాయంగా స్టీల్ బాక్సులు వాడాలని సూచించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అనిల్ కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నైనాదేవి, ఫీల్ సూపర్వైజర్లు బాలరాజు, సంపత్, వినీత్, శ్రావణేశ్ పాల్గొన్నారు.