03-01-2025 12:00:00 AM
ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకొంటూ ఉంటే అగ్రరాజ్యం అమెరికా మాత్రం వరస దాడులతో వణికి పోయింది. బుధవారం తెల్లవారుజామున న్యూ ఆర్లీన్స్‌లో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఓ దుండగుడు వాహనం తో జనంలోకి దూసుకెళ్లి, కాల్పులతో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో 15 మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు.
ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే లాస్‌వేగాస్‌లో కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ఇంటర్నేషనల్ హోటల్ సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా ఏడుగురు గాయపడ్డారు. టెస్లా కా రులో ఉన్న పేలుడు పదార్థాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అదే రోజు రాత్రి న్యూయార్క్‌లోని క్వీన్ కౌంటీకి చెం దిన అమజురా నైట్‌క్లబ్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఘటనలో 11 మంది గాయపడగా,కాల్పుల వెనుక ఇద్దరు దుండగులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 24 గంటల వ్యవధిలో చోటు చేసుకున్న వరస ఘటనలతో అమెరికా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా న్యూ ఆర్లీన్స్, లాస్ వేగాస్‌లో జరిగిన రెండు దాడులకు అద్దె కార్లనే వాడారు. అది కూడా ‘టూరో’ అనే కారు షేరింగ్ యాప్‌నుంచే ఈ రెండు కార్లను తీ సుకున్నారు.
అంతేకాకుండా ఈ రెండు దాడులకు పాల్పడిన ఇద్దరు దుం డగులు కూడా గతంలో అమెరికా సైన్యంలో పని చేసిన వారే కావడం, వారు ఉపయోగించిన వాహనాల్లో అత్యాధునిక ఆయుధాలు, పెద్ద మొ త్తంలో పేలుడు పదార్థాలను గుర్తించడంతో ఇవి ఉగ్రదాడులు కావచ్చని, వీటి మధ్య సంబంధం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్‌బీఐ అధికారులు కూడా చెప్తున్నారు.
న్యూఆర్లీన్స్‌లో దాడికి పాల్పడిన వ్యక్తిని 42 ఏళ్ల షంషుద్దీన్ జబ్బార్‌గా గు ర్తించారు. పోలీసుల కాల్పుల్లో అతను మరణించాడు. అతడి వాహనంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ జెండా లభించింది. అమెరికా సైన్యంలో పని చేసిన షంషుద్దీన్ కొంత కాలం అఫ్గానిస్థాన్‌లో కూడా సేవలు అందించాడు. వీలయినంత ఎక్కువ మందిని హతమార్చడమే లక్ష్యంగా దుండగుడు దాడికి పాల్పడినట్లు స్పష్టంగా కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు. అయితే అతను ఒక్కడే ఈ దాడికి పాల్పడ్డాడా లేక వెనక ఎవరైనా ఉన్నారా అనే విషయంపై కూడా ఎఫ్‌బీఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
కాగా ఈ ఘటనలపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్, కాబోయే అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. న్యూ ఆర్లీ న్స్, లాస్ వేగాస్ ఘటనలకు సంబంధం ఉందనిపిస్తోందని, ఇది ఉగ్రవాద చర్యగా కనిపిస్తోందని మస్క్ అన్నారు. లాస్ వేగాస్‌లో చోటు చేసు కున్న ఘటన పేలుడు పదార్థాల కారణంగానే జరిగిందని, టెస్లా వాహనం కాకుండా వేరే వాహనం అయి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదనీ అన్నారు.
వలసల వల్ల అమెరికాలో నేరాల సంఖ్య పెరిగిపోతోందని మరోవైపు ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను ఈ విషయమై ముందే హెచ్చరించా నని, తాను చెప్పింది నిజమేనని ఈ వరస ఘటనలు చెబుతున్నాయన్నా రు. కాగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా అమెరికాలో ఇటీవ లి కాలంలో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ట్రంప్ హత్యకు జరిగిన రెండు ఘటనలే ఇందుకు నిదర్శనం.
తాజా ఘటనల వె నక ఐఎస్‌ఐ ఉన్నా, లేక ఉగ్రవాదులే ఉన్నా కూడా అగ్రరాజ్యానికి కొత్త ముప్పు ఎదురవుతున్నట్లే భావించాలి. గతంలో అడపాదడపా కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నా అవన్నీ వ్యక్తులు చేసినవే. కానీ ఇవి ఉగ్రదాడులే అయితే మాత్రం వీటి వెనుక ఉన్న ముఠాల మూలాలను కనుగొనా ల్సిన అవసరం ఉంది. వలసల కట్టడికి కొత్త అధ్యక్షుడు ట్రంప్ కఠిన చర్యలు తీసుకొంటారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా ఘటనల ప్రభావం ఆయన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.