21-11-2025 12:05:42 AM
టిపిటిఎఫ్ ఈనెల 24న ఐటీడీఏ కార్యాలయ ముందు నిరసన ప్రదర్శన
భద్రాచలం (విజయక్రాంతి); గిరిజన సంక్షేమ విద్యారంగ, ఉపాధ్యాయుల, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నెల చివరి వారంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ గారికి, ఈ నెల 15న భద్రాచలంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇచ్చినప్పటికీ నేటికీ సమస్యలు పరిష్కరించబడకపోవడం లేదా చర్చలు చేయబడకపోవడంతో అనివార్యముగా రెండవ దశ పోరాట కార్యక్రమంలో భాగంగా ఈనెల 24న అన్ని జిల్లాలలో గిరిజన సంక్షేమ కార్యాలయాల ముందు ఐటీడీఏల ముందు నిరసన ప్రదర్శన జరిపి మెమోరాండం సమర్పించబడుతుందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులు బుటారి రాజు, రాష్ట్ర అకడమిక్ సెల్ సభ్యులు మునిగడప రామాచారిలు ఉపాధ్యాయులకు తెలిపారు.
గిరిజన విద్యా కళాశాలలో కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ పొందుతున్న గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులను కలుసుకొని మాట్లాడుతూ.... గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఇస్తున్న వృత్యంతర శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేయాలని కోరారు.గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలలో భాషా పండితుల, పిఈటిల పోస్టులను వెంటనే అప్గ్రేడ్ చేసి వారికే పదోన్నతులు ఇవ్వాలని, సిఆర్టిలకు, డైలీ వేజ్ వర్కర్లకు మినిమం టైమ్ స్కేల్ ఇచ్చి వారి సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని, వారికి ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ప్రధానోపాధ్యాయులు జిల్లా కౌన్సిలర్లు పాల్గొన్నారు.