27-09-2025 02:12:04 AM
-అధికార పార్టీలో ఉన్నా ప్రజల పక్షాన పోరాడుతా
-దక్షిణ భాగంలో వెళ్తున్న ట్రిపుల్ ఆర్ ప్రాంత ఎమ్మెల్యేలతో చర్చిస్తా
-మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు,సెప్టెంబర్ 26 (విజయకాంతి): ట్రిబుల్ ఆర్ దక్షిణ భాగం రహదారి నిర్మాణంలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ పట్టణం, మండలం, నారాయణ్ పూర్ , గట్టుప్పల్ , మర్రిగూడెం మండలాలకు చెందిన భూ నిర్వాసితులు శుక్రవారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని కలిశారు.దక్షిణ భాగంలో అలైన్‌మెంట్ మార్చారని, దివీస్ కంపెనీకి లాభం చేకూరేలా రైతుల పొట్ట కొడుతున్నారని రాజ్ గోపాల్ రెడ్డికి వారు ఫిర్యాదు చేశారు. భూమి పోతే జీవనమే పోతుందని మాకు న్యాయం చేయాలని భూమికి భూమి ఇవ్వడమే మా నినాదం అని వారు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రైతులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు.భూమికి రైతుకు మధ్య భావోద్వేగ బంధం ఉంటుందని.. ఇది చాలా సున్నితమైన సమస్య అన్నారు. భూమి కోల్పోతున్న బాధలో మీరు పడుతున్న ఆవేదనకు మీరు చేస్తున్న డిమాండ్లతో నేను ఏకీభవిస్తున్నానని తెలిపారు. పార్టీ కంటే, ప్రభుత్వం కంటే ప్రజలే ముఖ్యం అనే భావనతో ఆలోచన చేస్తున్నానని తెలిపారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయడానికి ట్రిబుల్ ఆర్ దక్షిణ భాగం రహదారి వెళ్తున్న నియోజకవర్గాల శాసనసభ్యు లతో కూడా మాట్లాడుతున్నానని.. ఈ విషయంలో అందరు ఎమ్మెల్యేలు ఆవేదనతో ఉన్నారన్నారు.
అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన మాట్లాడతానని.. పదవి అంటే కిరీటం కాదు పదవి అంటే బాధ్యత అన్నా రు. ధర్మం వైపు న్యాయం వైపు ఉంటాడు రాజ్ గోపాల్ రెడ్డి అని ప్రకటించారు.సగం మునుగోడు నియోజకవర్గం ఆర్‌ఆర్‌ఆర్‌లో కలుస్తుంది .. అలైన్ మెంటు మార్చడానికి కారణాలను రైతులకు వివరించి ఒప్పించి నిర్ణయం తీసుకోవాలన్నారు. మీకు న్యాయం చేసేవారి వైపు, మీకోసం కొట్లాడే వారి వైపు ఉండండి అని కోరారు. 2017 లో శివన్నగూడెం ప్రాజెక్టు ను ప్రారంభించారు... కానీ పరిహారం మాత్రం 2023 లో నేను రాజీనామా చేసిన తరువాత పూర్తి చేశారు .. భూ నిర్వాసితులకు ఎన్ని పార్టీలు అయినా ఉండని, మీకు నాయ్యం చేయడానికే ప్రయత్నం చేస్తున్నాన్నారు. ఉత్తర భాగం లోనే అలైన్ మెంట్ విషయంలో తప్పు జరిగింది.. ఇపుడు దక్షిణ భాగంలో కూడా ఆ తప్పు ను కొనసాగిస్తున్నారని.. దానిపై కొట్లాడుతానన్నారు.
దుర్గమాతకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
మునుగోడు పట్టణంలోని కనకదుర్గ ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని చల్మెడ గ్రామం లో కొత్తగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌ను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.