04-07-2025 12:08:07 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ పరిధిలోని మహా న్యూస్ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులను హైకోర్టు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. నిందితులను జూలై 15 వరకు చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు రిమాండ్ చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే ఇలాంటి చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయస్థానం, నిందితుల అక్రమ నిర్బంధం ఆరోపణలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, దర్యాప్తు అధికారికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులు ఏ2, ఏ3 లను రిమాండ్‌కు అప్పగించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భారతీయ న్యాయస్థానం పలు సెక్షన్లు కింద ఈ కేసు నమోదైంది.
వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం రాత్రి 10 గంటలకు నిందితులను పోలీసు లు కోర్టు ఎదుట హాజరుపరిచారు. అరెస్టుకు గల కారణాలను నిందితులకు వివరించా మని, వారి బంధువులకు కూడా సమాచారం ఇచ్చామని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితుల తరఫు న్యాయవాది అర్నేశ్ కుమార్ వాదనలు వినిపించారు.
నిందితులు మహా న్యూస్ కార్యాలయంపై రాళ్లు, రాడ్లు, ట్రిపాడ్‌తో దాడికి పాల్పడటం, అక్కడ పనిచేస్తున్న జర్నలిస్టులు, ఇతర ఉద్యోగులకు గాయాలు కావడాన్ని కోర్టు తీవ్రమైన నేరంగా పరిగణించింది. పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛను ప్రభావితం చేసే ఇలాంటి సంఘటనలను తేలికగా తీసుకుంటే తీవ్ర నష్టం వాటిల్లుతుందని కోర్టు అభిప్రాయపడింది.