11-08-2024 12:05:00 AM
హిజ్బొల్లా, హమాస్ కీలక నేతల హత్యల నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా దాడులు జరగవచ్చన్న వార్తలు వస్తున్నాయి. దీంతో గత కొద్ది రోజులుగా పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే, ఈ సమయంలో కూడా ఇజ్రాయెల్ గాజాపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా తూర్పు గాజాలోని ఓ పాఠశాలలో తలదాచు కుంటున్న వారిపై దాడి చేసింది. తూర్పు గాజాలో నిరాశ్రయులు తలదాచుకుంటున్న ఓ పాఠశాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇందులో దాదాపు వందమంది చనిపోగా పదుల సంఖ్యలో గాయపడినట్లు హమాస్ ప్రకటించింది.
ఉదయం ప్రార్థనలు జరుపుతున్న సమయంలో ఈ అమానుష దాడి జరిగిందని, మృతుల్లో చిన్నారులు, స్త్రీలు, వృద్ధులు ఉన్నారని గాజా ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని కూడా ఆయన చెప్పారు. అల్- పాఠశాలలో నిరాశ్రయులు తలదాచుకుంటున్న విషయం ఇజ్రాయెల్‌కు తెలుసునని కూడా ఆయన ఆరోపించారు. అయితే, హమాస్ ఉగ్రవాదులకు స్థావరంగా ఈ పాఠశాల ఉందని, అంతేకాదు వారి కమాండ్ కంట్రోల్ సెంటర్‌గానూ పని చేస్తున్నదన్న పక్కా సమాచారంతోనే తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం అంటున్నది.
ఈ స్కూలు నుంచి 20 మంది హమాస్, ఇస్లామిక్ జిహాదీ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమకు ఇంటెలిజన్స్ సమాచారం ఉందని సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలను అది ఆ ప్రకటనలో వెల్లడించలేదు. మృతులంతా గత పది రోజులుగా శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ప్రాణాలతో బైటపడిన వారని ‘అల్ జజీరా’ పత్రిక తెలిపింది. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ గాజాలోని పాఠశాలలపై వరస దాడులు చేస్తున్నది. ఆగస్టు నెలలో ఇజ్రాయెల్ పాఠశాలలపై దాడులు చేయడం ఇది ఐదో ఘటన.
ఆగస్టు 1న దలాల్ అల్- స్కూలుపై చేసిన దాడుల్లో 15 మందికి పైగా మృతి చెందారు. ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలో మరో మూడు పాఠశాలలపైనా దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 50 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడులను గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికాతోపాటు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్, ఈజిప్టు సైతం ఖండించాయి.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్- మధ్య కాల్పుల విరమణకు చర్చ లు జరుగుతాయో లేదో తెలియని పరిస్థితి ఉంది. ఎలాంటి సాకులు చెప్పకుండా చర్చలకు రావాలని మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా, ఈజి ప్టు, ఖతార్‌లు ఇరుపక్షాలకు రెండు రోజుల క్రితం స్పష్టం చేశాయి. కాల్పుల విరమణకు విధి విధానాలను ఖరారు చేశామని, ఎలా అమలు చేయాలన్న అం శంపైనే ఇజ్రాయెల్, హమాస్ కూర్చుని మాట్లాడుకోవలసి ఉందని మూడు దేశాలు ఓ సంయుక్త ప్రకటన చేశాయి. ఈ నెల 15న చర్చలు జరిగే అవకా శం ఉందని ఆ మూడు దేశాలు తెలిపాయి.
మధ్యవర్తులు చేసిన ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సానుకూలంగా స్పందించారు. దోహా లేదా కైరోలో జరగవచ్చని భావిస్తున్న చర్చలకు తమ ప్రతినిధి బృందాన్ని పంపిస్తామని కూడా ఆయన చెప్పారు. నెతన్యాహు ఈ ప్రకటన చేసి 24 గంటలు కూడా కాకముందే ఇజ్రాయెల్ తాజాగా గాజాలోని స్కూ లుపై దాడి చేయడాన్నిబట్టి హమాస్‌తో కాల్పుల విరమణకన్నా దాన్ని తుదముట్టించడమే తమ లక్ష్యమని నెతన్యాహు సర్కార్ చెప్పకనే చెప్పినట్లయింది. ఈ నేపథ్యంలో చర్చలకు హమాస్ అంగీకరిస్తుందా? అనేది అను మానమే.
ఇరాన్ రాజధాని టెహరాన్‌లో తమ నాయకుడు ఇస్మాయిల్ హని యే హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఆ సంస్థ ఆరోపిస్తున్నది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని కూడా ఇప్పటికే ప్రకటించింది. తమ గడ్డపై జరిగిన ఈ ఘటనపై ఇరాన్ ఉడికిపోతున్నది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ చర్చలు జరుగుతాయా? అన్నదే అనుమానంగా మారిం ది. అయితే, మధ్యవర్తిత్వ దేశాలు మాత్రం గంపెడన్ని ఆశలు పెట్టుకున్నాయి.