26-09-2025 12:00:00 AM
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ అల్లర్లతో అట్టుడికిపోతుంది. లద్దాఖ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ లేహ్ అపెక్స్ బాడీ ఆధ్వర్యంలో బుధవారం లద్దాఖ్ రాజధాని లేహ్‌లో పెద్ద ఎత్తున యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు మరణించగా.. 70 మందికి పైగా గాయపడ్డారు. 2019లో లద్దాఖ్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత రాష్ట్ర హోదా కోసం పలు దఫాలు కేంద్రం ఉద్యమకారులతో చర్చలు జరిపింది.
అయితే కేంద్రం విధించిన షరతులకు ఉద్యమకారులు అంగీకరించకపోవడంతో అవి విఫలమయ్యాయి. అక్టోబర్‌లో లద్దాఖ్ అంశంపై మరోసారి కేంద్రం చర్చలు జరపనున్న నేపథ్యంలో తాజాగా ఆందోళనలు చెలరేగాయి. దీంతో అల్లర్లను అదుపు చేయడం కోసం ప్రస్తుతం లద్దాఖ్‌లో కర్ఫ్యూ విధించారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తూ కల్పించడంతో పాటు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ లేహ్‌లో కొన్ని రోజులుగా నిరాహార దీక్షలు జరుగుతున్నాయి.
వీటికి పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వం వహించారు. ఈ నిరసనను సామాజిక అశాంతిగా అభివర్ణించిన వాంగ్ చుక్ తాజా ఉద్యమాన్ని ‘జెన్ విప్లవంగా పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోవడం వల్ల నిరుద్యోగం ఎక్కువైపోయిందని, ఫలితంగా లద్దాఖ్‌లో యువత ఆందోళనకు దిగారని వాంగ్ చుక్ వెల్లడించారు. అయితే లద్దాఖ్ 2019 వరకు జమ్మూ కశ్మీర్ అంతర్భాగంగా ఉండేది. అదే ఏడాది ఆగస్టులో రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం తీర్మానం చేసింది.
దాదాపు 3 లక్షల జనాభా కలిగిన లద్దాఖ్‌లో మొత్తం 8 తెగల వాళ్లు నివసిస్తున్నారు. లద్దాఖ్‌లో బౌద్ధులు ఎక్కువ. వారంతా భారత్‌తో కలిసి ఉండాలనే కోరుకుంటున్నారు. అయితే చైనా ఆ ప్రాంతాన్ని తమ దేశంలో కలుపుకునేం దుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఈ కారణంగానే లద్దాఖ్‌లో అశాంతి ఏర్పడుతోంది. అయితే 2019 అనంతరం లద్దాఖ్‌లో పరిస్థితులు మారిపోయాయి. నిన్న, మొన్నటి దాకా జమ్మూ కశ్మీర్‌లో భాగంగా ఉండి ఇప్పుడు కేంద్ర ప్రాంతంగా ఉన్న లద్దాఖ్ ప్రజలు నాలుగు డిమాండ్లు చేస్తున్నారు.
లద్దాఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి, భారత రాజ్యాంగం ఆరవ షెడ్యూల్‌లో లద్దాఖ్‌ను చేర్చడం, లద్దాఖ్‌కు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం, రెండు పార్లమెంటరీ సీట్లు (ఒకటి లేహ్‌కు, మరొకటి కార్గిల్‌కు) కోరుతున్నారు. పైగా లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే సమయంలో ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని ఇస్తామని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వాగ్దానం చేసింది. అయితే ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉండడంతో లద్దాఖ్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
రెండేళ్ల క్రితమే కేంద్ర హోం మంత్రి అమిత్ షా లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అదే ఇప్పుడు ఉద్యమంగా తీవ్ర రూపం దాల్చింది. గతంలో శ్రీనగర్ నుంచి, ఇప్పుడేమో ఢిల్లీ నుంచి పాలిస్తున్నారే తప్ప స్వపరిపాలన సాగనివ్వడం లేదని లద్దాఖ్ ప్రజలు భావిస్తున్నారు. తాజాగా ప్రత్యేక రాష్ట్ర హోదాపై కేంద్రం నుంచి ఇప్పటికీ స్పష్టమైన హామీ లేనప్పటికీ, తమ ఆందోళనలతో లద్దాఖ్ ప్రజలు వారి డిమాండ్లను పాలకుల ముందు ఉంచి ఒత్తిడి తేవడంలో విజయం సాధించినట్లే.