17-07-2025 05:53:45 PM
ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్
కరింనగర్ క్రైం,(విజయక్రాంతి): తొమ్మిది సంవత్సరాల 6 నెలల టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 2014 నుంచి 2023 వరకు ఈ రాష్ట్రంలో చెప్పలేనంత అధికార దుర్వినియోగం అవినీతి జరిగిందని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ ఆరోపించారు. గురువారం ప్రజామిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్నటి మొన్నటి వార్తల్లో విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్ సి మురళీధర్ రావుపై ఏసీబీ దాడుల్లో విస్తూ పోయే నిజాలు బయటకు వచ్చాయన్నారు. దాదాపుగా 500 కోట్ల రూపాయల విలువ చేసే అక్రమ ఆస్తులు అతని ఆధీనంలో ఉన్నాయని ఏసీబీ వాళ్లు ఒక అంచనాకు వచ్చారన్నారు.
గతంలో ఏసీబీ దాడుల్లో జరిగిన ఇంజనీర్ చీఫ్ హరి రామ్ నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఈ ముగ్గురు ఆస్తులు కలిపితే 1,000 కోట్ల పైనే ఉన్నాయని ఏసీబీ అధికారులు అంచనాకు వచ్చారన్నారు. గతంలో కూడా రెవెన్యూ డిపార్ట్ మెంట్ తాసిల్దార్ ల మీద ఏసీబీ దాడులు జరిగినప్పుడు ఒక్కొక్కరి వద్ద 50 కోట్ల కు మించిన అక్రమ సంపాదన కు సంబంధించిన ఆధారాలు దొరికాయి. ఆదేవిధంగా జిహెచ్ఎంసి, ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్, రెవిన్యూ, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్లు కెసిఆర్ పరిపాలనలో అవినీతి మయం అయిపోయన్నారు. ధరణి, 111 జీవో ఎత్తివేతకు సంబంధించి న దాంట్లో 2.5 లక్షల కోట్ల అవినీతి జరిగిందని స్వయాన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారన్నారు.
అధికారుల అవినీతి ఈ విధంగా బహిర్గతం అయింది కానీ గతంలో అధికారంలో ఉన్న పెద్దల అవినీతి బాగోతం వివరాలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయించడం లేదన్నారు. కెసిఆర్,కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు ఇతర మాజీ మంత్రులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతి విషయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు పలుమార్లు మాట్లాడినారు. ఆ అవినీతి లక్షల కోట్ల డబ్బు ఏ ఏ దేశాలలో వాళ్లు దాచుకున్నారొ దర్యాప్తు చేపించాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నదని అన్నారు. అప్పుడు ఈ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారిపోతుందన్నారు అవినీతిపరులపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజా మిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు