08-08-2025 12:00:00 AM
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమ్మెతో తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు రోజులుగా గందరగోళం నెలకొంది. సినీకార్మికుల వేతనాల పెంపు విషయమై కొందరు నిర్మాతలు చర్చలు కొనసాగిస్తున్నారు. ఓ వైపు చర్చలు.. మరోవైపు సినిమా ప్రమోషన్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రమోష న్స్‌లో పాల్గొంటున్న నిర్మాతలు తాజా పరిణామాలపై స్పందిస్తున్నారు. గురువారం నిర్వహించిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా పాట ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాసు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విలేకరుల నుంచి ఎదురైన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు సినిమా కార్మికుల గురించి మాట్లాడుతూ.. ‘ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్న వేతనాల పెంపు న్యాయమైనదే. కానీ, వాళ్లు అడుగుతున్న శాతం బాగా ఎక్కువగా ఉంది. అక్కడే నిర్మాతలకు, కార్మిక నేతలకు సయోధ్య కుదరడంలేదు. మూడేళ్ల నుంచి వేతనాలు పెంచలేదన్న మాట వాస్తవమే. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 శాతం పెంచాలనడం సమంజసంగా లేదు.
ఈ విషయంలో అందరూ ఒక నిర్ణయానికి వచ్చి, కొంత పెంచాల్సిన అవసరమైతే ఉంది’ అని చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. “తెలుగు ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. కానీ, ఆ స్థాయికి ఎన్ని సినిమాలు వెళ్తున్నాయన్నదీ గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాంటి పది సినిమాలను దృష్టిలో పెట్టుకొని లెక్కలేసుకోవడం, మన రెవెన్యూ పెరిగిపోయిందనుకోవడం సరైంది కాదు. ప్రస్తుతం ధరలు పెరిగాయి.
ఎంత సినిమా అయినా రూ.12 కోట్ల బడ్జెట్ అవుతోంది. బ్లాక్‌బస్టర్ అయితే తప్ప లాభాల్లేవు. అలాంటి సినిమాలు ఎన్ని తీయగలరు? తెలుగు సినిమా టెక్నీషియన్ల స్కిల్ అప్‌డేట్ చేయాలి. పూర్తిగా మనవాళ్లతో ఇంటర్నేషనల్ స్థాయి సినిమా చేయలేం. అందుకే బయట నుంచి టెక్నీషియన్లను తీసుకొస్తున్నాం. ఆ కారణంగానే బడ్జెట్ మారుతోంది. మనవాళ్లు ఆ స్థాయిని అందుకునేదాకా బయటివారు రావాల్సిందే” అని వివరించారు.