14-12-2025 07:16:59 PM
మఠంపల్లి (విజయక్రాంతి): సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలం మఠంపల్లి గ్రామానికి చెందిన ఉన్నూర్ చిన్నభూషి అనే భవన నిర్మాణ కార్మికుడు ఆదివారం అకాల మరణం చెందిన విషయం తెలిసిన వెంటనే భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఆయన నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మృతునికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మృతుని కుటుంబానికి సంఘం తరఫున రూ.5,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సంఘం నాయకులు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు సూర్యపేట జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ పాల్గొని మాట్లాడుతూ, పేద కుటుంబానికి చెందిన చిన్నభూషి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడికి రావలసిన సంక్షేమ భీమా తదితర ప్రయోజనాలు తక్షణమే కుటుంబానికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా, ఉపాధ్యక్షుడు మాడుగుల నాగుల్ మీరా, ప్రధాన కార్యదర్శి కందుల నాగలక్ష్మి, కోశాధికారి మామిడి నాగరాజు, కాంతమ్మ, వెంకటమ్మ, సాయమ్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.