calender_icon.png 24 December, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా యూరియా యాప్

24-12-2025 02:01:45 AM

  1. త్వరలో అన్ని జిల్లాల్లో అమలుకు సన్నాహాలు
  2. సోయాబీన్, మొక్కజొన్న రైతులకు కేంద్రం న్యాయం చేయాలి
  3. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, కిషన్‌రెడ్డి, సంజయ్‌కికి లేఖలు: మంత్రి తుమ్మల

హైదరాబాద్, డిసెంబర్  23 (విజయక్రాంతి): వ్యవసాయశాఖ ద్వారా ప్రవేశపెట్టిన యూరియా యాప్ ఐదు జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలవుతోందని, రెండు రోజులగా పరిశీలన జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఐదు జిల్లాలైన ఆదిలాబాద్, జనగామ, మహబూబ్ నగర్, నల్లగొండ, పెద్దపల్లిలో మొత్తం దాదాపు లక్ష మందికి పైగా యూప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని చెప్పారు. మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా యూరియాకు సంబంధించిన యాప్‌పై మంత్రి తుమ్మల రైతులకున్న సందేహాలను నివృత్తి చేశారు.

ఈ రెండు రోజుల్లో యాప్ విజయవంతం కావడంతో, యాప్‌ను మరికొన్ని రోజులు పరిశీలించి రాష్ర్ట వ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధం కావాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. ఈ రబీ సీజన్‌కు రాష్ట్రానికి ఇప్పటికే 5.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. తెలంగాణలో వానాకాలం (ఖరీఫ్) 2025 -26 సీజన్‌లో కురిసిన అకాల, దీర్ఘకాలిక భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన సోయాబీన్, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి మంత్రి తుమ్మల లేఖలు రాశారు. సుమారు 36 వేల మెట్రిక్ టన్నుల వర్షనష్టం చెందిన సోయాబీన్‌ను ధర మద్దతు పథకం (పీఎస్‌ఎస్) కింద కొనుగోలు చేసేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరారు. అవసరమైతే ఎఫ్‌ఏసీ నిబంధనల్లో సడలింపులు ఇస్తూ, అమలుకావాల్సిన ధర విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, మొక్కజొన్న రైతుల పరిస్థితిపై కూడా దారుణంగా ఉందన్నారు. 

రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 2.96 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసి, వేలాది రైతులకు అండగా నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నాఫెడ్ ద్వారా రాష్ర్టం కొనుగోలు చేసిన మొక్కజొన్నను ఎథనాల్, డిస్టిల్లరీ పరిశ్రమలకు సరఫరా చేసేలా తక్షణ ఆదేశాలు జారీ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే కొనుగోలు, నిల్వ, రవాణా, లాజిస్టిక్స్, మౌలిక వసతుల పరంగా పూర్తి సహకారం అందిస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.