08-08-2025 12:06:29 AM
జనసంద్రంగా దుకాణాలు, షాపింగ్ మాల్స్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): శుక్రవారం సౌభాగ్య ప్రదాయిని వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని గురువారం భాగ్యనగరంలో దుకాణాలు, షాపింగ్‌మాల్స్ కొనుగోలుదారులతో సందడిగా మారాయి. పండుగకు అవసరమైన పూజా సామగ్రి, పూలు, పండ్లను కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు తరలిరావడంతో గురువారం సాయంత్రం నుంచే హైదరాబాద్‌లోని ప్రధాన బజార్లన్నీ జనసంద్రంగా మారాయి.
ఈ నేపథ్యంలో పూలు, పండ్ల ధరలు ఆకాశాన్నంటాయి. పండుగకు ఒకరోజు ముందు నుంచే నగరంలోని అతిపెద్ద పూల మార్కెట్ అయిన గుడిమల్కాపూర్‌తో పాటు మోండా మార్కెట్, మాదన్నపేట, ఎర్రగడ్డ రైతు బజార్ వంటి ప్రాంతాలు కొనుగోలుదారులతో నిండిపోయాయి. గుడిమల్కాపూర్ మార్కెట్‌లో నాణ్యమైన కమలం పువ్వు ఒక్కొక్కటి రూ. 80 నుంచి రూ. 100 వరకు పలికింది. బేగం బజార్, కోఠి, అబిడ్స్, అమీర్‌పేట వంటి వాణిజ్య ప్రాంతాల్లోని వస్త్ర దుకాణాలు, గాజుల షాపులు, పూజా సామగ్రి విక్రయ కేంద్రాలు కూడా రద్దీగా మారాయి.