15-05-2025 02:25:40 AM
వేములవాడ, మే14(విజయక్రాంతి): దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే పనులు మొదలు పెట్టాలని కోరుతూ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి, బీజేపీ, బి.ఆర్.ఎస్ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన స్వచ్ఛంద పట్టణ బంద్ విజయవంతంగా ముగిసింది.
ఉదయం 6 గంటల నుండి సాయంత్రం వరకు కొనసాగిన బందులో భాగంగా పట్టణంలోని అక్కడక్కడ టీ, టిఫిన్, మటన్, చికెన్ సెంటర్లు తప్పితే మిగతా దుకాణాలు చాలా వరకు తెరుచుకోలేదు. బంద్ సందర్బంగా బిజెపి బిఆర్‌ఎస్ పార్టీలకు చెందిన నాయకులు రాజన్న ఆలయ పరిసరాలతో పాటు పట్టణంలోని ఆయా వ్యాపార, వాణిజ్య సముదాయాల వద్దకు వెళ్లి బందుకు సహకరించాలని కోరారు.
ఇదిలా ఉండగా అభివృద్ధిని అడ్డుకోవడంలో భాగంగానే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు బంద్ పేరిట పట్టణ ప్రజలను రాజన్న భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇది ముమ్మాటికి తప్పుదోవ పట్టించడమేనని, ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో ఆలయ అభివృద్ధి పనులను కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు.
పట్టణంలోని ముఖ్య ప్రాంతాల్లోనీ వ్యాపార సముదాయాల్లోకి వెళ్లి బందుకు సహకరించవద్దని యజమానులను కోరారు. మరోవైపు బంద్ సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా సిఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసారు.
ప్రజల సహకారంతో బంద్ విజయవంతం
వేములవాడ పట్టణ ప్రజల సహకారంతో బంద్ విజయవంతం అయ్యిందని ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వం దగ్గర నిధులే లేవని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు ఆలయ అభివృద్ధి ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాజన్న ఆలయం మూసివేస్తే పరివార దేవతమూర్తుల విగ్రహాలను, కోటిలింగాలను తొలగించకూడదని డిమాండ్ చేశారు.
ఆలయ అభివృద్ధికి సంబంధించిన ఎలాంటి మ్యాప్ ఇంకా విడుదల చేయకపోవడంతో ఎలా అభివృద్ధి చేస్తారు అనే సందేహం భక్తుల్లో నెలకొంది అన్నారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం పనిచేస్తున్నారు తప్ప.. రాజన్న పై భక్తితో కాదని విమర్శించారు. 60 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.