05-12-2025 12:14:44 AM
పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు
తాడ్వాయి, డిసెంబర్ 4(విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి భక్తులు తరలివచ్చారు. రెండు రోజులపాటు శ్రీ శబరిమాత ఆశ్రమంలో జరిగే జాతర ఉత్సవాలకు భక్తులు నలుమూలల నుంచి తరలివచ్చారు.
ఉదయం సుప్రభాత ధ్యానంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీమద్ భగవద్గీత,గురు గీత పారాయణం అనంతరం గోమాత పూజ రోహణ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల అనంతరం భక్తులు గ్రామంలో భిక్షాటన చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవములో వేద పండితులు వేదమంత్రాలు చదువుతూ అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేశారు. మధ్యాహ్నం ఉత్సవాలకు విచ్చేసిన మహాత్ములు తమ తమ సందేశాలు వినిపించారు. సాయంత్రం శ్రీదత్తాత్రేయ డోలారోహణోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి రథోత్సవం వైభవంగా జరిగింది.
శ్రీ శబరిమాత ఆశ్రమం నుంచి పాత బస్టాండ్ వరకు రథోత్సవ యాత్ర కొనసాగింది. భక్తులు రథం ముందు భజన పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ముందుకు వెళ్లారు. ప్రతి సంవత్సరం రెండు రోజులపాటు జరిగే జాతర ఉత్సవాలకు అదిలాబాద్, నిర్మల్, మెదక్, జహీరాబాద్, కరీంనగర్, హైదరాబాద్ బాసర,మహారాష్ట్ర, కర్ణాటక ల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులు ముందుగా అమ్మవారి పాలరాతి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
జాతర ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఆశ్రమ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం అన్నదానం నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఆలయం ఆవరణలో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.