03-10-2025 11:12:36 PM
70 అడుగుల రావణ ప్రతిమ దహనం
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
హన్మకొండ,(విజయక్రాంతి): వరంగల్ నగరంలోని ఉర్సు రంగలీల మైదానంలో గురువారం సాయంత్రం నిర్వహించిన దసరా సంబరాలు అంబరానంటాయి. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపురి సంజయ్ బాబు, ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్, ట్రస్ట్ చైర్మన్ కోటేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 10 తలల 70 అడుగుల రావణ ప్రతిమను మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,బండ ప్రకాష్, జి డబ్ల్యూ ఎంసీ కమిషనర్ చాహత్ భాయ్ భాయ్ లతో కలిసి స్విచ్ ఆన్ చేసి ప్రతిమను దహనం చేశారు. మీరేమొట్లు గొలిపి బాణసంచాల వెలుగులతో ప్రాంగణమంతా మార్మోగింది.
అంతకుముందు కరిమబాద్ రామస్వామి గుడి నుండి సీతారామాంజనేయ, లక్ష్మణుడి విగ్రహాలను వ్రతంపై ప్రతిష్టించి, వేలాదిమంది భక్తులు వెంటరాగా శోభాయాత్ర రంగలీల మైదానానికి చేరుకొంది. ఈ యాత్ర కోలాటం, డప్పుచప్పులు, వాయిద్యాలు, భజనలు, నృత్యాలనడుమ ఉత్సాహంగా సాగింది. అనంతరం షామీ పూజ పాలపిట్ట దర్శనం నిర్వహించారు.ఈ వేడుకల్లో పేరీని శివతాండవం, కూచిపూడి నృత్యాలు, విద్యార్థులు ప్రదర్శనలు రాణి రుద్రమ, జానపద గేయాలు, తెలంగాణ ఆటపాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. యువతి యువకులు కేరింతల కొడుతూ సంబరాలలో మునిగి తేలారు.
ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ చెడుపై మంచి విజయం సాధించిన రోజున్నే ప్రజలు విజయదశమిని జరుపుకోవాలని ఆనవాయితీగా వస్తుందని, దసరా విశిష్టత గురించి వివరించారు. రంగలీల మైదానంలో భక్తుల సౌకర్యంకోసం అధికారులు ఉత్తమ ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. మంత్రి కొండా సురేఖ ,నగర మేయర్ గుండు సుధారాణి తో కలిసి రంగశాయిపేట, కొత్తవాడ, ఎస్ఆర్ఆర్ తోట మైదానం ప్రాంతాల్లో జరిగిన సంబరాల్లోనూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లో మరుపల్లి రవి, పోశాల పద్మ, ముష్కమల్ల అరుణ, అనిత, స్థానిక ప్రజాప్రతినిధులు, జి డబ్ల్యూ ఎం సి అధికారులు తదితరులు పాల్గొన్నారు.