29-12-2025 12:43:03 AM
కామారెడ్డి, డిసెంబర్28 (విజయక్రాంతి): వచ్చే ఫిబ్రవరి రెండవ వారంలో కామారెడ్డి జిల్లా దోమకొండ ఊర పండుగను ఘనంగా నిర్వహించాలని సార్వజనిక మండలి నిర్ణయించింది.గ్రామ సర్పంచ్ అయిరేని నర్సయ్య ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక శ్రీ చాముండేశ్వరి మందిరంలో జరిగిన సకల జనుల కుల సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.ఇందు కోసం అయ్యే ఖర్చును సర్పంచ్,గ్రామ కుల సంఘాలు సమానంగా భరించేందుకు తీర్మానించారు.ఊర పండుగ ఊరందరు కలిసి జరుకునే వేడుక.గ్రామ దేవతలను పూజించి వారి ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో వెల్లివిరియలని కోరుకునే ఈ పండగ ప్రాధాన్యత.
గ్రామానికి అరిష్టాలు తొలిగి మేలు జరగాలని కోరుకుంటూ ఈ ఉత్సవాన్ని ఐదురోజులు ఘనంగా నిర్వహిస్తారు.దీనిలో జాతరలు,ఊరేగింపులు గ్రామ దేవతలకు నివేదనలు ఉంటాయి.పోతురాజు వేషాలుంటాయి.సామూహిక భక్తి ఐక్యతకు ఇది ప్రతీకగా నిలుస్తుంది.గ్రామదేవతలైన పోచమ్మ, నల్ల పోచమ్మ,పోలేరమ్మమైసమ్మ, సారలమ్మ, ఊరడమ్మ. తదితర దేవతలను తమ తమ సంస్కృతి మేరకు ఆరాధిస్తారు.గ్రామ శ్రేయస్సును ఏక కంఠంతో కోరుకుంటారు.పచ్చదనం,పంటలు బాగా పండి ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుతారు.
నిర్వహణ బాధ్యతలను గ్రామస్తులందరూ తీసుకుంటారు.ఇది గ్రామస్తులందరినీ ఏకం చేస్తుంది.ఊరేగింపులు,కొలువులు,పోతురాజు వేషాలు,బోనాలు వంటివి ఈ సందర్భంలో ముఖ్యమైన అంశాలు.ఇది కేవలం పూజ మాత్రమే కాదు. గ్రామ సంస్కృతి,సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.సామాజిక సంవాదాలను బలోపేతం చేసేదని ప్రముఖ సామాజిక జానపద సంస్కృతీ పరిశోధకులు,గ్రామ పురోహితులు ఎస్.వెంకటేశ్వర శర్మ తెలిపారు.దోమకొండ గ్రామ సంస్కృతి సంప్రదాయాలను నేటితరానికి తెలిపేందుకు ఉపకరిస్తుందని అన్నారు.