21-11-2025 01:01:57 AM
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
కరీంనగర్, నవంబరు 20 (విజయ క్రాంతి): సర్పంచ్ ఎన్నికలు జరపకపోవడంతో గ్రామాలు వల్లకాడుల్లాగా మారాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో బల్బులు పెట్టేవాళ్లు, మురికి కాలువలు శుభ్రం చేసేవారు లేరని, ప్రజల అవసరాలను పట్టించుకునే నాథులే కరువయ్యారన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఎన్నికలు జరగకుంటే రావని, అవి వస్తేనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. రెండేళ్లుగా గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడిందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉండడని, గ్రామాల్లో ఉండి ప్రజలకు సేవ చేసి సమస్యలను పరిష్కరిస్తానని విశ్వాసం కల్పించే వారిని ఎన్నుకుంటారన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువ మందిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. బిల్లులు రాక సర్పంచులు, ఉపసర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం బకాయిలన్నీ వెంటనే చెల్లించి పోటీ చేసే వారిలో విశ్వాసాన్ని నెలకొల్పాలన్నారు. మా నాయకుల మధ్య విబేధాలు ఉన్నాయనేది కొన్ని ఛానల్స్, సోషల్ మీడియా సృష్టి అని ఈటల రాజేందర్‌తెలిపారు.