06-08-2025 12:57:21 AM
- బిజినెస్, టూరిస్ట్ వీసాకు షూరిటీ కింద 15వేల డాలర్లు చెల్లించాల్సిందే
- అమెరికా విదేశాంగ శాఖ ప్రతిపాదన
వాషింగ్టన్, ఆగస్టు 5: వలసదారులపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా తాజాగా వీసాలపై ఆంక్షలు మరింత కఠినతరం చేసింది. బిజినెస్, టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు షూరిటీ కింద 15 వేల డారల్ల వరకు బాండ్ చెల్లించాలని అమెరికా విదేశాంగ శాఖ ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్ట్రీలో నోటీసులు పబ్లిష్ చేయనుంది. 12 నెలల పైలట్ ప్రోగ్రామ్ కింద ఈ కొత్త నిబంధన తీసుకురానున్నట్టు పేర్కొంది.
బీ (బిజినెస్), బీ (టూరిస్ట్) వీసాలపై ఈ నిబంధన తీసుకురానున్నారు. ఫెడరల్ రిజిస్ట్రీలో అధికారి నోటీసు పెట్టిన 15 రోజుల్లోపూ ఈ పైలట్ ప్రోగ్రామ్ అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. బిజినెస్, పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు అమెరికా ప్రవేశం పొందాలంటూ కనీసం 5 వేలు, 10వేలు, 15వేల సెక్యూరిటీ బాండ్లు సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది.
నిబంధనలకు అనుగుణంగా నడుచుకొని గడువు పూర్తయిన తర్వాత దేశం వీడితే ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. ఒకవేళ చట్టవిరుద్ధ కార్యకలపాలకు పాల్పడితే వీసా గడువు ముగిశాక అమెరికాలో ఉంటే ఎలాంటి రీఫండ్ దక్కదు. అయితే ఈ బాండ్ నిబంధన అన్ని దేశాల ప్రజలకు ఉండదని అమెరికా తెలిపింది.