06-08-2025 01:00:03 AM
- సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్
- తెలంగాణ స్థానికత వ్యవహారంపై ముగిసిన విచారణ
- తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం ధర్మాసనం
న్యూఢిల్లీ, ఆగస్టు 5: పదేళ్లు స్థానికంగా ఉండి రెండేళ్లు బయట ప్రాంతంలో చదువుకోవడానికి వెళ్తే స్థానికత ఎలా కోల్పోతారో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. స్థానికత నిబంధనల కారణంగా తెలంగాణ విద్యార్థుల హక్కులకు అన్యాయం జరగకూడదని తెలిపారు. మంగళవారం తెలంగాణ స్థానికత వ్యవహారంపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
పదో తరగతి తర్వాత రెండేళ్లు బయట ఉంటే స్థానికత వర్తించదన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులపై పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థుల పిటిషన్‌పై విచారించి తగిన నిబంధనలు రూపొందించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. స్థానికత అంటే ఏమిటి? ఎవరు దీని పరిధిలోకి వస్తారు? అందుకు ఉన్న పరిమితులపై మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ విద్యార్థులు సుప్రీంను ఆశ్రయించారు.
తాజాగా ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్యాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘కోటా, దుబాయ్ లాంటి ప్రాంతాలకు చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులకు స్థానికత వర్తించదంటే ఎలా? ఒక విద్యార్థి తెలంగాణలో పుట్టి పెరిగి.. రెండేళ్లు బయట చదువుకున్నంత మాత్రాన కోటా వర్తించదంటే ఎలా? ప్రతి విద్యార్థి 371 డి అధికరణం గురించి తెలుసుకోవాలన్నట్టుగా మీ వాదనలు ఉన్నాయి.
నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు ఉంటే.. 8వ తరగతిలోనే రాజ్యాంగం గురించి తెలుసుకోవాలన్న విధంగా మీ వాదన ఉంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పలు రాష్ట్రాల్లో స్థానికత వ్యవహారం పలు విధాలుగా ఉందన్న అభిషేక్ సింఘ్వీ అస్సాంలో ఏడు సంవత్సరాల నిబంధన ఉందని గుర్తు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో పేద, మధ్యతరగతి వాళ్లకు జరుగుతున్న ఉపయోగాన్ని విస్తృత కోణం నుంచి చూడాలని, అందుకు తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టు జస్టిస్ గవాయ్ ధర్మాసనం తెలిపింది.