calender_icon.png 26 January, 2026 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఓటర్ల దినోత్సవం

26-01-2026 12:13:56 AM

  1. ఓటు హక్కు విలువ తెలుసుకుని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి  
  2. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

చుంచుపల్లి, జనవరి 25, (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతాయుతంగా, సద్వినియోగపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపు నిచ్చారు. ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యువజన , క్రీడల శాఖ ఆధ్వర్యంలో నూతన ఓటర్లతో నిర్వహించిన సైకిల్ ర్యాలీని కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులను ఎన్నుకునే అత్యున్నత హక్కు ఓటు హక్కు అన్నారు.

ప్రజల అభిప్రాయాలకు ఆమోదయోగ్యంగా, ఎక్కువమంది ఆదరణ పొందిన ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించిందన్నారు. గతంలో ఓటు హక్కు సాధన కోసం అనేక త్యాగాలు, ఉద్యమాలు, పోరాటాలు జరిగాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జాతీయ ఓటరు దినోత్సవం ప్రతి పౌరుడు ఓటు హక్కు విలువ, విశిష్టతను అవగాహన చేసుకునేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థలో తన పాత్రను గుర్తించేందుకు ఒక మంచి అవకాశమన్నారు. 

ముఖ్యంగా నూతన ఓటర్లు, యువత ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ నూతన ఓటర్లు, యువత, ప్రజలు, అధికారులతో కలిసి ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ ప్రతిజ్ఞలో భాగంగా భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై సంపూర్ణ విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడుతామని, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల నిర్వహణను పరిరక్షిస్తామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా మా ఓటు హక్కును వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ రైల్వే స్టేషన్ వరకు కొనసాగగా, ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువత, నూతన ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కు వినియోగంపై అవగాహన సందేశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖల అధికారి పరంధామ రెడ్డి, ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్ , పాల్వంచ తాసిల్దార్ ధారా ప్రసాద్, ఎన్నికల ట్రైనర్ సాయి కృష్ణ,ఎన్నికల సిబ్బంది నవీన్,సంబంధిత శాఖల అధికారులు, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ సిబ్బంది,  విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

ఐడీఓసీ కార్యాలయంలో.. 

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 25, (విజయక్రాంతి): జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఐడిఓసి కార్యాలయ ప్రాంగణంలో బి ఎల్ ఓ లకు  నిర్వహించిన ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించే విధంగా బూత్ లెవెల్ అధికారులు  రూపొందించిన అందమైన ముగ్గులు అందరి మన్ననలు అందుకున్నాయి. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యా ర్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేసి అభినందించారు.

చిన్న వయసులోనే ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగగలరని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్న బూత్ లెవల్ అధికారులు (బిఎల్‌ఓలు)కు అవసరమైన కిట్లను జిల్లా కలెక్టర్ అందజేశారు.

అలాగే ఎన్నికల విధుల్లో ప్రతిభ కనబరిచి ఉత్తమ ఎలక్టోరల్ అధికారులుగా ఎంపికైన తాసిల్దార్లు, జిల్లా మాస్టర్ ట్రైనర్ కు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లను ప్రత్యేకంగా సన్మానించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాజంలోని ప్రతి వర్గం భాగస్వామ్యమని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్, తాసిల్దార్లు పుల్లయ్య, ధార  ప్రసాద్, ఎన్నికల జిల్లా మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ, సంబంధిత శాఖల అధికారులు విద్యార్థులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్లు, నూతన ఓటర్లు  తదితరులు పాల్గొన్నారు.

ఓటు వేయడం కర్తవ్యం

ములకలపల్లి, జనవరి 25 (విజయక్రాంతి): ప్రజలందరూ ఓటు వేయడం కర్తవ్యంగా భావించాలని ములకలపల్లి తాసిల్దార్ భగవాన్ రెడ్డి సూచించారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ములకలపల్లి లో ఆదివారం కేజీబీవీ విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో పాల్గొన్న అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పక్షపాతం లేకుండా కుల మత వర్గ విభేదాలు, ఒత్తిడిలకు లోను కాకుండా ప్రలోభాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని కోరారు.

ఓటు వేయడం అనేది ప్రధాన కర్తవ్యంగా భావించాలని సూచించారు. ఓటు హక్కును వినియోగించు కోవడం అంటే దేశానికి సేవ చేసిన దాంతో సమానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ మహేశ్వరి, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఏఎస్‌ఐ పుల్లారావు పాల్గొన్నారు.

కారేపల్లిలో ఓటర్ దినోత్సవ ర్యాలీ

కారేపల్లి, జనవరి 25 (విజయక్రాంతి): జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా కారేపల్లి లో ఆదివారం అధికారులు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు కస్తూర్బా విద్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ పోలీస్ స్టేషన్ మీదుగా బస్టాండ్ సెంటర్ చేరుకొని మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నూతన ఓటర్లతో తమ ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, నిజాయితీగా ఓటు వేస్తామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ అనంతుల రమేష్ ఎస్త్స్ర బైరు గోపి, సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోనీ) లు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని దానిని తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ దుగ్గిరాల జయరాజు, డీడీ కృష్ణయ్య, ఆర్‌ఐ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.