calender_icon.png 19 May, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జాలతో అంతరించనున్న జల వనరులు

19-05-2025 05:01:31 PM

ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య..

హుజురాబాద్ (విజయక్రాంతి): చెరువులు, కుంటలు, వాగులు, కాలువల కబ్జాలతో జల వనరులు అంతరించే ప్రమాదం ఉందని ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... హుజురాబాద్ నడి బొడ్డులోని సర్వే నంబర్ 2477 లోని గంగోని కుంట విస్తీర్ణంలో 12 ఎకరాల 16 గుంటలు ఉండాలని కానీ కబ్జాదారుల కోరల్లో పడి ఇప్పుడు కనీసం 6 ఎకరాలు కూడా లేదని సమ్మయ్య వాపోయారు. జమ్మికుంట రోడ్డుకు ఇరువైపులా ఉన్న మాడల్ చెరువు నుండి చంద్రవోని కుంట, గుండ్ల చెరువులకు నీటిని తీసుకెళ్లే గొలుసు కట్టు కాలువలు పూర్తిగా కబ్జాకు గురయ్యాయని ఎన్నోసార్లు మున్సిపాలిటీ, ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులకు ఫిర్యాదులు చేసిన మామూలుగా తీసుకుంటున్నారని అన్నారు.

రాబోయే వానాకాలంలో జమ్మికుంట రోడ్డులోని పలు కాలనీలు నీట మునుగుతాయని, అధికారులే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. హుజురాబాద్ పట్టంలో గంగోని కుంట శిఖం భూమి, బట్టోని కుంట, కట్టు కాలువలతో పాటు వరంగల్ రోడ్డును అనుకోని ప్రవహించే చిలుకావాగును కూడా ఇరువైపుల కబ్జాలు చేసి వాల్టా చట్టాన్ని విస్మరించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని గత నెలలో జిల్లా కలెక్టర్ పిర్యాదు చేశానని దానిపై హుజురాబాద్ యంపిడిఓ ఆదేశాలు అందిన కూడ అక్రమార్కులపై చర్యలు తీసుకోలేదని, చిలుకావాగు పక్కన యథేచ్ఛగా జరుగుతున్న నిర్మాణమే నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ అధికారులు చెరువులు కుంటలు వాగుల కట్టు కాలువల కబ్జాలను ఫిర్యాదులు ఇచ్చిన ఎందుకు పట్టించుకోవడం లేదో వాల్టా చట్టం అమలు పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో అధికారుల అలసత్వమే నిదర్శనం అన్నారు. సీఎమ్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.